Begin typing your search above and press return to search.

పొత్తు కుదిరింది... మూడు దశాబ్ధాల వైరానికి తెర పడింది!

ఎన్నికల సమయం కావడంతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   11 April 2024 6:09 AM GMT
పొత్తు కుదిరింది... మూడు దశాబ్ధాల వైరానికి తెర పడింది!
X

ఎన్నికల సమయం కావడంతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆప్తమిత్రులు బద్దశత్ర్వులు ఐపోతున్నారని చెబుతుండగా.. బద్దశత్రువులు సైతం ఆప్తమిత్రులుగా కలిసిపోతున్న సంఘటనలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సుమారు మూడు దశాబ్ధాల వైరానికి తెరపడిన ఘటన తెరపైకి వచ్చింది. ఇది కూటమికి గుడ్ న్యూస్ అనే అంటున్నారు పరిశీలకులు.

అవును... రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావించిన చంద్రబాబు, కూటమిగా ముందుకు కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కర్నూలు జిల్లాలో అనూహ్య పరిణామం నెలకొంది. ఇందులో భాగంగా... 33 ఏళ్ళ తరువాత భూమా - ఇరిగెల వర్గాలు కలిసాయి! ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు వర్గాలతో చర్చలు జరిపి ఒక్కటి చేశారని చెబుతున్నారు. దీంతో... కర్నూలు టీడీపీలో ఇది కీలక పరిణామం అని అంటున్నారు!

దీంతో... ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్న బూమా - ఇరిగెల వర్గాలు రానున్న ఎన్నికల్లో కలిసి కట్టుగా ముందుకు వెళ్లనున్నాయి. ఈ మేరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ - జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... త్వరలోనే ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు ఆళ్లగడ్డలో ఉమ్మడి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.

వాస్తవానికి దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి. అయితే... 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి టీడీపీ అభ్యర్దిగా పోటీలో నిలిచిన సమయంలో ఇరిగెల వర్గం మద్దతు ప్రకటించింది. అయితే.. అనంతర పరిణామాలతో వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో... ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా అసెంబ్లీ బరిలో నిలిచారు.

ఇక 2019 ఎన్నికల్లోనూ భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా... వైసీపీ అభ్యర్థి బిజేంద్రరెడ్డికి మద్దతు ప్రకటించింది ఇరిగెల వర్గం! అయితే కొన్ని నెలల క్రితం ఇరిగెల సోదరులు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సమయంలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే... కూటమిలో భాగంగా ఆళ్లగడ్డ సీటు టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు దక్కిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఈ రెండు వర్గాలను దగ్గర చేసేందుకు సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నివాసంలో జరిగిన భేటీలో ఈ రెండు వర్గాలూ కలిసి పని చేసేందుకు అంగీరించాయని అంటున్నారు. దీంతో... ఇది ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు పెద్ద గుడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు!