నా కుటుంబం నాశనం అవుతుంది...భూమన సంచలనం
ఆ తరువాత మాట్లాడుతూ తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అవినీతికి తాను పాల్పడలేదని అన్నారు.
By: Tupaki Desk | 23 Sep 2024 5:29 PM GMTటీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలనం సృష్టించారు. తాను పనిచేసిన పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు చోటు చేసుకోలేదని ఒట్టేశారు.
ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయం ఎదుట సత్య ప్రమాణం చేశారు. గత కొద్ది రోజులుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అని టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో భూమన కఠిన నిర్ణయమే తీసుకున్నారు
తన హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు అని ఆయన శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని లోకానికి చాటి చెప్పేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. భూమన విషయానికి వస్తే గత ఏడాది ఆగస్ట్ 10న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన జూన్ 4న ఫలితాలు రావడంతో తన పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన కామెంట్స్ తనను బాధించాయని అంటూ భూమన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన పుష్కరిణిలో సోమవారం సాయంత్రం పవిత్ర స్నానం చేసిన అనంతరం అఖిలాండం వద్ద స్వామి వారికి కర్పూర నీరాజనం సమర్పించారు.
ఆ తరువాత మాట్లాడుతూ తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అవినీతికి తాను పాల్పడలేదని అన్నారు. టీటీడీ ప్రతిష్టకు తాను ఎలాంటి భంగం కలిగించలేద్ని సత్య ప్రమాణం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తన పాలనలో అన్న ప్రసాదంలో అలాగే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీలకు పాల్పడలేదని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇంత నిర్భీతిగా ప్రమాణం చేసాను అని ఆయన చెప్పారు. తాను కనుక తప్పులు చేస్తే తనతో పాటు తన కుటుంబం సర్వ నాశనం అవుతుందని ఆయన చెప్పడం విశేషం.
తన పైన ఆరోపిస్తున్న వారు కూడా తన మాదిరిగా సత్య ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా తన మనసు కలత చెందుతోందని ఆయన అన్నారు. నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా తాను ఫీల్ అవుతున్నానని అన్నారు. ఇదిలా ఉండగా భూమన సత్య ప్రమాణం చేస్తూండగా పోలీసులు ఆయనను లాక్కెళ్ళిపోయారు.
అయితే అంతకు ముందు అలిపిరి టోల్ గేట్ వద్ద పోలీసులు కరుణాకరరెడ్డికి నోటీసులు అందించారు. తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదని వారు కోరారు. అయితే తాను తిరుమలలో రాజకీయాలు చేయలేదని, అలా చేయకూడదని కోరుకునే వాడిని అని అన్నారు. మొత్తానికి చూస్తే భూమన సత్య ప్రమాణంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.