Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కాదా.. పవన్ స్వామీజీనా ?

ఆయన కాషాయ ధారిగా మారి నుదుటున ఎర్రటి నామంతో జుట్టుకు ముడి వేసిన శిఖతో ఇలా అపర స్వామీజీ అవతారమే ఎత్తేశారు అని అన్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 2:30 PM GMT
పవన్ కళ్యాణ్ కాదా.. పవన్ స్వామీజీనా ?
X

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కాదు కానీ ఆయనలోకి సరికొత్త ఆధ్యాత్మిక కోణం బయటపడింది. ఆయన కాషాయ ధారిగా మారి నుదుటున ఎర్రటి నామంతో జుట్టుకు ముడి వేసిన శిఖతో ఇలా అపర స్వామీజీ అవతారమే ఎత్తేశారు అని అన్నారు.

శ్రీవారి లడ్డూలు కల్తీ అయ్యాయి అన్న దాని మీద సీరియస్ అయిన పవన్ సరికొత్తగా ఈ అవతార్ లో జనం ముందుకు వచ్చారు. తానే సిసలైన సనాతనీ అని కూడా చెప్పుకున్నారు. ఏకంగా పన్నెండు పదమూడు రోజుల పాటు పవన్ ని ఈ గెటప్ లో చూసిన వారు అంతా ఏమనుకున్నారో తెలియదు కానీ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డికి మాత్రం ఆయనలో కొత్త దేవుడే కనిపించాడు.

అంతే కాదు పవన్ స్వామీజీకి జై అని కూడా సెటైర్లు వేశారు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు అన్నట్లుగా పవన్ స్వామీజీ పాదాలకు తాకు కెవ్వు కేక అని ఆయన అత్తారింటికి దారేదీ సినిమాలో పాట కూడా సిట్యువేషన్ కి తగినట్లుగా పాడి మరీ పవన్ లోని బాబాను చూపించేశారు.

రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో బాబా పవనే అని ఆయనను మొక్కకపోతే దిక్కు లేకుండా పోతారని సెటైర్లూ వేశారు. పవన్ కాదు సుమా మహా మహిమాన్వితుడైన స్వాముల వారే ఆయన సుమా అని కూడా భూమన వెటకరించారు.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రీల్ లైఫ్ లో ఎన్నో గెటప్స్ వేశారు. రియల్ లైఫ్ లో చూస్తే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక చాలానే గెటప్స్ వేశారు అంటారు ప్రత్యర్ధులు. ఆయన 2019లో జనసేన తరఫున ప్రచారం చేస్తూ నల్ల కంబలి ధరించారు. ఎర్ర తువ్వాలు మెడలో వేసుకున్నారు.

ఫక్తు విప్లవకారుడిగా కరడు కట్టిన కమ్యూనిస్టుగా కనిపించారు. దానికి పూర్తిగా విరుద్ధంగా ఆయన ఇపుడు కాషాయాంబర ధారిగా సనాతన వాదిగా కనిపిస్తున్నారు. ఈ రకంగా పరస్పర విరుద్ధమైన భావజాలాన్ని ఎత్తుకోవడం ఎవరి వల్లా సాధ్యం అయితే కాదు. ఒక్క పవన్ కి మాత్రమే అది సాధ్యం. ఆయనకే ఆ యాక్సెప్టెన్స్ కూడా లభిస్తుంది అని కూడా అనే వారు ఉన్నారు.

ఆయన సనాతన వాదాన్ని ధర్మాన్ని వినిపించే గొంతుకను సీరియస్ గా తీసుకునే వారు ఉన్నారు. వారి కంటే సెటైర్లు వేసే వారు కూడా ఉన్నారు. పవన్ అయిదున్నర జీవిత కాలంలో ఇలాంటి మాటలు గతంలో ఎపుడూ చెప్పి ఉండలేదు కాబట్టే సడెన్ గా ఈ వేషాన్ని చూసిన భూమన లాంటి వారు కొత్త దేవుడండీ అని పాటలు పాడినా ఆ విమర్శల గురించి ఆలోచించేవారూ ఉన్నారు.

సరే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి అయింది, వారాహి డిక్లరేషన్ కి రెండు వారాలు గడచాయి. ఇంతకీ పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ఎంతదాకా వచ్చిందంటే జవాబు పవన్ స్వామీజీ చెప్పాలి అని ప్రత్యర్ధులు అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఎప్పటి మాదిరిగానే ధవళ వస్త్రాలతో కుర్తా పైజామాతో తనదైన జనసేనని గెటప్ లో ఉప ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నారు. ఆయన మళ్లీ కాషాయం కట్టేదెపుడు అంటే సనాతన ధర్మానికి ప్రమాదం వచ్చినపుడు అన్న సెటైర్లు ఉండనే ఉన్నాయి.