Begin typing your search above and press return to search.

నేను క్రిస్టియన్ నాస్తికున్ని అయితే... భూమన ఘాటుగా హాటుగా ?

తిరుపతిలో రచయిత భుమాన్ రాసిన 'మూడు తరాల మనిషి భూమన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 5:22 PM GMT
నేను క్రిస్టియన్ నాస్తికున్ని అయితే... భూమన ఘాటుగా హాటుగా ?
X

టీటీడీ చైర్మన్ భూమన కరూణాకరరెడ్డి తన మీద వస్తున్న ఆరోపణల మీద ఒక లెవెల్ లో రియాక్ట్ అయ్యారు అవి ఘాటుగా హాటుగా ఉన్నాయి. తిరుపతిలో రచయిత భుమాన్ రాసిన 'మూడు తరాల మనిషి భూమన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఈ రోజు కొత్తగా టీటీడీ చైర్మన్ పదవి చేపట్టలేదని 17 ఏళ్ల క్రితమే ఆ బాధ్యతలు తీసుకున్నానని గుర్తు చేశారు. తాను తిరుమల శ్రీవారి భక్తుడిగా ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టాను అని గుర్తు చేశారు. తన హయాంలో టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

దళిత వాడలకు గోవిందుడిని తీసుకుని వెళ్లి కళ్యాణాలు చేయించింది తానే అన్నారు. తిరుమల మాడ వీధులలో పాదరక్షలతో భక్తులు తిరగరాదు అన్న నిబంధన తన హయాంలోనే తెచ్చాను అన్నారు. కొండ మీదకు కాలి నడకన వెళ్ళే సామాన్య భక్తులకు దివ్య దర్శనం లభించేలా చూసింది టోకెన్ల విధానం ప్రవేశపెట్టింది తానే అన్నారు.

అన్నమయ్య జయంతి ఉత్సవాలను జరపాలన్న ప్రతిపాదలను తీసుకుని వచ్చింది తాను అప్పట్లో చైర్మన్ గా ఉండగానే అన్నారు. తిరుమలలో జరిగే ఉత్సవాలు పూజలు అన్నీ ప్రతీ రోజూ ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఏర్పాటు ఆలోచన చేసింది తానేనని ఆయన అన్నారు.

అలాగే 32 వేల మంది సామాన్యులకు కళ్యాణమస్తు ద్వారా పెళ్లిళ్లు జరిపించాలనే ఆలోచన కూడా తనదేనన్నారు. వేద విశ్వవిద్యాలయం స్థాపనలోనూ తానే కీలక పాత్ర పోషించానన్నారు. తాను వెంకటేశ్వర స్వామి పట్ల పూర్తి భక్తి ప్రపత్తులతో గతంలో పనిచేశానని, ఇపుడు పనిచేస్తానని ఆయన అన్నారు. తనను సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతున్నారని, అనరాని మాటలు అంటున్నారని ఆయన ఆవేదన చెందారు.

అయితే తాను ఎక్కడా మనోనిబ్బరం అయితే కోల్పోనని అన్నారు. తాను చేసే మంచి పనులను ఎక్కడా ఆపనని, తన దీక్షను ఇవేమీ అడ్డనుకు కానే కావని ఆయన అన్నారు. తాను భక్తుల కోసం పనిచేస్తాను అన్నారు. తాను స్వామి వారి కృపతో రానున్న కాలంలో అనేక మంచి కార్యక్రమాలను తిరుమలలో చేపడతాను అని కరుణాకరరెడ్డి చెప్పుకొచ్చారు.

మొత్తానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డి మీద వస్తున్న ఆరోపణలకు ఆయన ఘాటుగా సూటిగా బదులిచ్చేశారు. తాను నాస్తికుడిని కాను అన్నారు. మరి ఆయన ఇచ్చిన ఈ వివరణలకు విపక్షాలు సంతృప్తి చెంది శాంతిస్తాయా లేక ఇంకా విమర్శలు చేస్తాయా అన్నది చూడాల్సి ఉంది.