చంద్రబాబుతో ములాఖత్.. భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు!
కోడలు బ్రాహ్మణి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులతో కలిసి ములాఖత్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటకొచ్చిన భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 25 Sep 2023 2:33 PM GMTటీడీపీ అధినేత, తన భర్త చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి భువనేశ్వరి తాజాగా కలిశారు. కోడలు బ్రాహ్మణి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులతో కలిసి ములాఖత్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటకొచ్చిన భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఒక కుటుంబం అని కార్యకర్తలు తమ బిడ్డలని తెలిపారు. టీడీపీ జెండాను రెపరెపలాడించడానికి కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరని ధీమా వ్యక్తం చేశారు. నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. దీన్ని బట్టి ఏపీలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని విమర్శలు చేశారు.
తమ కంపెనీ(హెరిటేజ్)లో 2 శాతం వాటా అమ్మినా తమకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అలాంటిది తమకు అవినీతికి పాల్పడ్డాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబును అనవసరంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. "సింహంలా గర్జించే ఆయనను మీరు జైల్లో పెట్టి ఉండొచ్చు. కానీ ఒకటి మరిచిపోతున్నారు. ఇక నుంచి ప్రజల కోసం మరింత కసిగా చంద్రబాబు పని చేస్తారు" అని భువనేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు.
బినామీ కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సందర్శించారు. శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము తమకు వద్దన్నారు. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని భువనేశ్వరి తెలిపారు. తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అయినా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు.
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది పొందిన అనేక మంది సీఈవో స్థాయికి వెళ్ళారని భువనేశ్వరి గుర్తు చేశారు. చంద్రబాబు చేసింది తప్పా? అని నిలదీశారు. ఐటీ, ఇతర రంగాల వారు తమకు సంఘీభావం తెలపడానికి హైదారాబాద్ నుంచి రాజమండ్రికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు టెర్రరిస్టులా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్‌లు కావాలా? అని నిలదీశారు.
అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు.
కాగా భువనేశ్వరి అన్నవరంలో రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.