Begin typing your search above and press return to search.

బాబు జైల్లో ఉన్నట్లు దేవాన్ష్ కి తెలియదు... కన్ ఫాం చేసిన నాయనమ్మ!

దీంతో... "తాతయ్య విదేశాల్లో ఉన్నారు" అని సర్ధిచెప్పుతున్నారంట! ఈ విషయాలను తాజాగా భువనేశ్వరి వెల్లడించారు. "నిజం గెలవాలి" కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఈ ప్రస్థావన వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 5:18 AM GMT
బాబు జైల్లో ఉన్నట్లు దేవాన్ష్  కి తెలియదు... కన్ ఫాం చేసిన నాయనమ్మ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 ఉదయం నంద్యాలలో అరెస్టైన చంద్రబాబు నాటినుంచీ ఇంటికి వెళ్లలేదు. అయినప్పటికీ ములాకత్ ద్వారా భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కలుస్తూనే ఉన్నారు కానీ... మనవడు దేవాన్ష్ కి బాబుకీ మధ్య మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది! తాజాగా ఆ విషయాలపై భువనేశ్వరి స్పందించాల్సి వచ్చింది!!


అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైనప్పటినుంచీ చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ ని కలవలేకపోయారు. అయితే దేవాన్ష్ మాత్రం తన తాత చంద్రబాబు గురించి అడుగుతూనే ఉంటారంట. దీంతో... "తాతయ్య విదేశాల్లో ఉన్నారు" అని సర్ధిచెప్పుతున్నారంట! ఈ విషయాలను తాజాగా భువనేశ్వరి వెల్లడించారు. "నిజం గెలవాలి" కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఈ ప్రస్థావన వచ్చింది.

నారా భువనేశ్వరి ప్రస్తుతం "నిజం గెలవాలి" అనే యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతిలో నిర్వహించిన సభలో పలువురు ప్రశ్నలు అడగ్గా భువనేశ్వరి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... "తాత ఎక్కడ అని మనవడు దేవాన్ష్‌ అడుగుతున్నాడా" అని నన్నపనేని రాజకుమారి ప్రశ్న అడిగారు! దీనికి భువనేశ్వరి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు!

ఇందులో భాగంగా... "తాత ఎక్కడున్నడని మా మనవడు దేవాన్ష్‌ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌ కు తెలియదు. చిన్న పిల్లాడు అవ్వడంవల్ల తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం" అని భువనేశ్వరి సమాధానం ఇచ్చారు. అనంతరం స్కిల్ స్కాం కేసుపై స్పందించిన భువనేశ్వరి... "ముందు రూ.3 వేల కోట్లు అన్నారు.. చివరికి రూ.27 కోట్లు అంటున్నారు. సాక్ష్యాధారాలు లేకుండా 48 రోజుల నుంచి చంద్రబాబును జైల్లో నిర్బంధించారు".. అని అన్నారు!

ఇదే సమయంలో ప్రజల సొమ్ముతో తమ కుటుంబం ఎప్పుడూ బతకలేదని.. ఈ సందర్భంగా తాను సీఐడీ అధికారులకు గ్యారంటీ ఇస్తానని.. వచ్చి ఏం తనిఖీ చేసుకుంటారో చేసుకోవచ్చని తెలిపిన భువనేశ్వరి... ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు కేసులు పెట్టి టీడీపీని బెదరగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు వచ్చిన స్పందన, చంద్రబాబు చేపట్టిన 'భవిష్యత్తుకు గ్యారంటీ' విజయవంతం కావడంతో భయపడి ఆయన్ను అరెస్టు చేశారని ఆమె విమర్శించారు!

ఈ సందర్భంగా... చంద్రబాబు నిత్యం ప్రజల గురించే ఆలోచించే నాయకుడని చెప్పిన భువనేశ్వరి... అరగంట ములాఖత్‌ లో 25 నిమిషాలు పార్టీ, ప్రజలు, టీడీపీ బిడ్డల గురించి అడుగుతారని.. మిగిలిన 5 నిమిషాలు తన వంక చూస్తారని భువనేశ్వరి తెలిపారు. తనలో ఉన్న ఎన్టీఆర్‌ పౌరుషం.. చంద్రబాబు క్రమశిక్షణ, ఓర్పు తనను ముందుకు తీసుకెళ్తాయని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మైకందుకున్న జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్‌... "చంద్రబాబు రాముడైతే, మీరు సీత. లక్ష్మణుడు లాంటి పవన్‌ కల్యాణ్‌ వస్తుంటే మధ్యలో ఆపేశారు. మిమ్మల్ని, లోకేష్ ను పవన్‌ కలవడం మీకు ఎలా అనిపించింది?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్పందించిన భువనేశ్వరి... "పవన్ కళ్యాణ్ కూడా మాలాగే ఆలోచిస్తారు" అని అన్నారు.

"పవన్‌ కల్యాణ్‌ ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరోగ్యం గురించి అడుగుతూనే ఉన్నారు. ఆయన కూడా మాలాగే గంజాయి, అత్యాచారాల గురించి చాలా బాధపడ్డారు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. ఆయనా మాలాగే ఆలోచిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా" అని తెలిపారు. ఇలా ప్రజలూ, నాయకులూ అప్పటికప్పుడు అడిగిన పలు ప్రశ్నలకు భువనేశ్వరి సమాధానాలిచ్చారు!