Begin typing your search above and press return to search.

బాబు ఉన్న స్నేహ బ్లాక్ ఆయన కట్టిందే... భువనేశ్వరి భావోద్వేగం!

ఇప్పుడు అదే బ్లాక్‌ లో ఆయనను కట్టి పడేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 4:34 AM GMT
బాబు ఉన్న స్నేహ బ్లాక్  ఆయన కట్టిందే... భువనేశ్వరి భావోద్వేగం!
X

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్నారు. అది ఆయనే కట్టించారని భువనేశ్వరి తెలిపారు!

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును... ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి పరామర్శించారు. ఈ ములాఖత్ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ములాఖత్ ముగిసిన అనంతరం భువనేశ్వరి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మరింత భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్భంగా... ఉదయం నుంచి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గురించే చంద్రబాబు మాట్లాడేవారని.. ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్‌ ను జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిపేందుకు ఆయన జీవితమంతా ధారపోశారని వాపోయారు! ఎప్పుడైనా కుటుంబం గురించి మాట్లాడాలని గట్టిగా నిలదీస్తే.. నాకు ముందు ప్రజలే ముఖ్యం.. ఆ తర్వాతే కుటుంబం అనేవారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

అనంతరం... చంద్రబాబుకు కేటాయించిన బ్లాక్‌ ను గతంలో ఆయన ప్రభుత్వంలోనే నిర్మించారని భువనేశ్వరి గుర్తు చేశారు. ఇప్పుడు అదే బ్లాక్‌ లో ఆయనను కట్టి పడేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జైలులో మెరుగైన సౌకర్యాలు లేవని, చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని, సోలార్ ప్యానెల్స్ పని చేయట్లేదని సిబ్బంది వివరించారని ఆమె చెప్పారు.

ఈ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు విజయవాడ నుంచి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్‌, నారా రోహిత్‌ మంగళవారం మధ్యాహ్నం రాజమండ్రి చేరుకున్నారు.

అనంతరం స్థానికంగా లోకేష్ బస చేసిన యువగళం బస్సులోకి వెళ్లారు. అక్కడే భోజనం చేసిన తర్వాత బయలుదేరి మధ్యాహ్నం 3:45 గంటలకు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి మాత్రమే అధికారులు ములాకత్ కు అవకాశం కల్పించారు. దీంతో... అనుమతుల ప్రక్రియ పూర్తయిన అనంతరం చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలుసుకుని మాట్లాడారు.