Begin typing your search above and press return to search.

టీడీపీని మోయాల్సింది ఆమె మాత్రమే...!

దీంతో తెలుగుదేశం పార్టీకి ఇపుడు అన్నీ ఆమె అవుతున్నారు. ఆమె ఎవరో కాదు నారా భువనేశ్వరి. ఆమెకు రాజకీయాలు కొత్త అంటే నిజంగా జనంలోకి రావడం అంటే కొత్త అనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:23 PM GMT
టీడీపీని మోయాల్సింది ఆమె మాత్రమే...!
X

ఘనమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ. నాలుగు దశాబ్దాల హిస్టరీ సొంతం అయిన పార్టీ ఎన్నో అప్రతిహత విజయాలను అలవోకగా సాధించి చరిత్ర పుటలలో పదిలపరచుకున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వంటి గ్లామర్ లీడర్ ని చంద్రబాబు వంటి గ్రామర్ ఉన్న లీడర్ ని చూసి దశాబ్దాల పాటు వారి నాయకత్వంలో సాఫీగా సాగిన టీడీపీకి ఇపుడు కొత్త నాయకురాలుగా ఆమె కనిపిస్తున్నారు.


చంద్రబాబు అరెస్ట్ అయి జైలు పాలు అయిన కఠిన నేపధ్యంలో టీడీపీ శ్రేణులు అంతా అచేతనంగా మారిన వాతావరణం కనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉరకలు వేయాల్సిన పార్టీలో నిరాశ నిండా కమ్ముకుంది. ఎటు చూసినా నిబ్బరం అయితే కానరావడంలేదు

చంద్రబాబు తాను పనిచేస్తూ క్యాడర్ చేత పనిచేయించేవారు. అలాంటి బాబు పార్టీకి తాత్కాలికంగా దూరం అయినా ఆ దెబ్బ చాలానే కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇపుడు అన్నీ ఆమె అవుతున్నారు. ఆమె ఎవరో కాదు నారా భువనేశ్వరి. ఆమెకు రాజకీయాలు కొత్త అంటే నిజంగా జనంలోకి రావడం అంటే కొత్త అనే అంటున్నారు.

ఆమె తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. దాదాపుగా ఏడున్నరేళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ముమ్మారు ఏపీకి సీఎం. అయినా కూడా ఎక్కడా భువనేశ్వరి ప్రస్తావన కానీ ఆమె రాజకీయ హడావుడి కానీ కనిపించలేదు. దశాబ్దాలుగా ఆమె తెర వెనక్కి ఉంటూ వచ్చారు. ఇపుడు తప్పనిసరి పరిస్థితి. అనివార్యత ఆమెను రాజకీయంగా ముందుకు తెస్తున్నాయి.

ఆమె చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. అదే విధంగా ఆయా జిల్లాలలో జరిగే బహిరంగ సభలలో ఆమె మాట్లాడుతారు. ఇటు క్యాడర్ కి ఉత్సాహం ఇస్తూనే అటు జనంతోనే టీడీపీకి కొత్త బంధం వేయడానికి భువనేశ్వరి చేస్తే ప్రయత్నం ఇది. నిజంగా భువనేశ్వరికి ఇది బిగ్ టాస్క్ గానే చెప్పాలి.

ఆమె ప్రసంగాలు జనాలను అలరించాలి. అదే సమయంలో ఆమె అధికార వైసీపీ మీద నిప్పులు చెరగాలి. అటు పార్టీని భరోసా కల్పించాలి. ఈ విషయంలో భువనేశ్వరి ఎంతవరకూ సక్సెస్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది. ఆమె చంద్రబాబుని అన్యాయంగా జైలులో ఉంచారని దాదాపుగా యాభై రోజుల తరువాత జనంలోకి వచ్చి చెబితే అది ఎంతవరకూ ప్రజలకు చేరుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఎందుకంటే మొదట్లో బాబు అరెస్ట్ అక్రమం అని జనాలలో కొంత శాతం అయిన నమ్మి ఉండవచ్చు. కానీ ఇపుడు కోర్టు పరిధిలోనే అంతా సాగుతోంది. సుప్రీం కోర్టు దాకా కేసులతో విచారణ సాగుతోంది. కోర్టులు ఇచ్చే తీర్పుల మీదనే బాబు జైలు జీవితం ఆధారపడి ఉంది. ఆ సమయంలో అన్యాయంగా ప్రభుత్వం బంధించి ఉంచింది అని ఆమె చెబితే ఎంతవరకూ జనాలు రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి.

మరో వైపు చూస్తే స్కిల్ స్కాం కేసులో ఆధారాలు చూపించలేకపోయారు అని టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఏపీ సీఐడీ ఏ ఆధారాలు చూపించకపోతే ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని నమ్మకపోతే కోర్టులు రిమాండ్ విధించవు కదా అన్న ప్రశ్న ముందుకు వస్తుంది. సో న్యాయపరంగా ఇదంతా చూడాల్సి ఉంటుంది.

ఇక రాజకీయంగా ఈ విషయాలను జనాల్లో పెట్టి ఎంతవరకూ ప్రజల మద్దతు టీడీపీ వైపు ఉండేలా భువనేశ్వరి చూస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన పరిణామం. ఆమె ప్రసంగాలను ఆమె చెప్పే విషయాలను జనాలు మధింపు చేసుకుంటారు. ఏది ఏమైనా భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ జైలు కంటే కూడా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అన్న వాదన కూడా ఉంది.

గత కొంతకాలంగా ప్రజా సమస్యల మీద విపక్షాల నుంచి సరైన పోరాటం లేదు, ఆ చాన్స్ ఆమె తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించి గద్దిస్తే కనుక అది టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉందీని అంతున్నారు. చూడాలి మరి భువనేశ్వరి స్పీచెస్ జనాలలో ఎలా వెళ్తాయో. వాటి ఇంపాక్ట్ ఏమిటో, చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితం పట్ల జనంలో ఉన్న అసలైన సానుభూతి ఎంత మోతాదులో ఉందో అన్నీ లెక్కకు తెలుస్తాయని అంటున్నారు.