పార్లమెంటుకు భువనేశ్వరి.. సంచలన నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు!
అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీడీపీపొలిట్ బ్యూరోలోని కీలక సభ్యులకు చంద్రబాబు ఈ విషయం తేల్చి చెప్పారు.
By: Tupaki Desk | 4 Feb 2024 9:45 AM GMTవచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. వైసీపీవర్సెస్ టీడీపీ-జనసేన మిత్రపక్షంతో పాటు.. కాంగ్రెస్ కూడా బరిలోకి దిగనుంది. దీనికి తోడు చిన్నా చితకా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోటీ బలం గా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. అయితే.. ఇంత బలాన్ని.. అంతే సామర్థ్యంతో ఎదుర్కొనేందు కు టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ప్రత్యర్థుల ఆనుపానులను గుర్తించి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గతానికి బిన్నంగా ఇప్పుడు తన సతీమణి నారా భువనేశ్వరిని ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీడీపీపొలిట్ బ్యూరోలోని కీలక సభ్యులకు చంద్రబాబు ఈ విషయం తేల్చి చెప్పారు. అక్కడ భువనమ్మ ను పోటీ పెడితే.. ఎలా ఉంటుందో అంచనా వేయాలని వారిని ఆదేశించినట్టు సమాచారం. విజయవాడ, లేదా విశాఖ, ఈ రెండు కుదరని పక్షంలో రాజమండ్రిలో అయినా.. పార్టీ ఆమెకు సీటు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయవాడ, రాజమండ్రి మినహా.. విశాఖ వైసీపీ అభ్యర్థికోసం ఆ పార్టీ వెతుకులాడుతోంది.
బలమైన అభ్యర్థిని ముఖ్యంగా సినీ రంగం నుంచి తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తోంది. అయితే.. దీనికి పోటీగా టీడీపీలో నాయకులు ఉన్నా.. ఇంకా బలమైన సెంటిమెంటును ఇక్కడ రంగరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి పేరును ఆయన తాజాగా ప్రస్తావించినట్టు సమాచారం. వాస్తవానికి ఇన్నేళ్లలో నారా భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. కానీ, చంద్రబాబు ను జైల్లో పెట్టిన తర్వాత.. ఆమె బయటకు వచ్చారు. మీడియాతో నూ మాట్లాడుతున్నారు.
ఇక, చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టారన్న వార్తను తట్టుకోలేక గుండెలు పగిలి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుంచి మంచి ఆరదణ లభిస్తోంది. పార్టీ పరంగానూ భువనేశ్వరి ఎంట్రీని అందరూ స్వాగతిస్తున్నారు. ఒకానొక దశలో చంద్రబాబు బయటకు రాకపోతే.. పార్టీని ఆమే నడిపిస్తారని చర్చ కూడా జరిగింది.
ఇలాంటి సానుకూలత ఉన్ననేపథ్యంలో నారా భువనేశ్వరిని కీలకమైన పార్లమెంటు స్థానం నుంచి రంగంలోకి దింపే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏం జరుగుతుందోచూడాలి. అవసరమైతే.. ఇప్పుడు ప్రకటించిన వారిలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. భువనేశ్వరిని రంగంలోకి తీసుకురావడం వెనుక.. మహిళా సెంటిమెంటు ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహం కూడా ఉండి ఉంటుందని అంటున్నారు. మరి ఏంచేస్తారో చూడాలి.