ప్రభుత్వ హక్కులను ప్రశ్నిస్తున్న భువనేశ్వరి.. ట్వీట్ వైరల్!
ఈ సందర్భంగా సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 17 Oct 2023 8:42 AM GMTఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో చంద్రబాబుని సీఐడీ అరెస్ట్ చేయగా.. 39 రోజులగా ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే సెప్టెంబర్ 30న "మోత మోగిద్దాం", అక్టోబర్ 7న "కాంతి క్రాంతి", అక్టోబర్ 15న "న్యాయానికి సంకెళ్లు" వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టిన టీడీపీ శ్రేణులు... తాజాగా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు! ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాజమండ్రి నిర్వహించే ఏ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు నోటీసు విడుదల చేశారు.
దీంతో ఈ విషయంపై నారా భువనేశ్వరి సీరియస్ అయ్యారు! ఇందులో భాగంగా... చంద్రబాబుకు మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.
అవును... "చంద్రబాబుకి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది?" అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఈ ట్వీట్ కు పోలీసులు ఇచ్చిన నోటీసును కూడా జత చేశారు నారా భువనేశ్వరి. అయితే... శాంతిభద్రతలను పరిరక్షించడం, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం పోలీసులు, ప్రభుత్వం బాధ్యత అనే విషయం తెలిసిందే!
కాగా... "ది. 17-10-2023 నుంచి 19-10-2023వ తేదీ వరకు రాజమండ్రి నందు జరగబోవు సంఘీభావ యాత్ర కార్యక్రమానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. కావున మీరు టీడీపీ పార్టీ కార్యకర్త అయినందున 17-10-2023 నుంచి 19-10-2023 తేదీ వరకూ రాజమండ్రి నందు జరగబోవు సంఘీభావ యాత్రలో పాల్గొనడానికి వెల్లటానికి వీలు లేదు. అందుకు విరుద్ధంగా మీరు ప్రవర్తించినయెడల అట్టివారు.. పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని తెలియజేస్తున్నాం" అని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా వాదన్లు వినిపిస్తుండగా... ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు వినిపించనున్నారు.