నాడు జగన్ చేసినట్టుగానే.. అచ్చం ఇప్పుడు చంద్రబాబు సతీమణి!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వ్యూహాలే పన్నుతున్నారు.
By: Tupaki Desk | 23 Feb 2024 10:39 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వ్యూహాలే పన్నుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన బీజేపీని కూడా ఇందుకు ఒప్పించే పనిలో ఉన్నారు.
మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం రాష్ట్రంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ఆమె రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 50 రోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
చంద్రబాబును జైలులో పెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఆ అరెస్టును తట్టుకోలేక గుండె ఆగి మరణించారని టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి పరామర్శ యాత్ర చేస్తున్నారు. మరణించినవారి కుటుంబాల ఇళ్లకు వెళ్తున్న ఆమె పార్టీ తరఫున రూ.3 లక్షల చెక్కును అందిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతున్న మాటలు బూమరాంగ్ అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కుప్పంలో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబుకు రెస్టు ఇచ్చి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేద్దామని అనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే వీటిని అందిపుచ్చుకున్న వైసీపీ ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడానికి భయపడుతున్నాడని.. తన స్థానంలో తన భార్యను పోటీ చేయించాలని అనుకుంటున్నాడని ప్రచారం మొదలుపెట్టేసింది.
ఇప్పుడు తాజాగానూ భువనేశ్వరి మాట్లాడిన మాటలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలన్నింటిని ఒకే చోటకు పిలిచి చెక్కులు ఇద్దామని టీడీపీ నేతలు, తన కుటుంబ సభ్యులు చెప్పారని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. అయితే అలా కాదని..చనిపోయినవారి ఇంటికి వెళ్లి మనమే పరామర్శిస్తే బాగుంటుందని తాను వారితో చెప్పానని.. వారు వద్దన్నా వినకుండా నిజం గెలవాలి పేరిట యాత్ర చేస్తున్నానని తెలిపారు.
దీంతో సహజంగానే వైసీపీ భువనేశ్వరి మాటలను తమకు అనుకూలంగా మలచుకుంటోంది. నాడు వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు.. ఆ మరణాన్ని తట్టుకోలేక కొందరు గుండెపోటుతో మృతి చెందారని.. వారిని పరామర్శిస్తానని వైఎస్ జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని.. మరణించినవారి కుటుంబాలన్నింటిని ఒకే చోటకు పిలిచి పరామర్శించడం, ఆర్థిక సాయం చేయాలని కోరిందని టాక్ నడిచింది.
అయితే కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి వైఎస్ జగన్ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓదార్పు యాత్ర చేపట్టారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారికి ఆర్థిక సాయం చేసి వచ్చారు. జగన్ చేసేది ఓదార్పు యాత్ర కాదని.. దండయాత్ర అని నాటి కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు విమర్శలు చేసినా జగన్ తగ్గలేదు.
నాడు జగన్ చేసినట్టుగానే.. అచ్చం ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి యాత్ర కూడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఆమె జగన్ నే కాపీ కొట్టారని చెబుతున్నారు. తాము ఆనాడు చేస్తే తప్పన్నారు.. ఇప్పుడు భువనేశ్వరి చేస్తోంది ఏమిటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.