Begin typing your search above and press return to search.

‘లాంగ్ రేంజ్ మిస్సైల్’..ఒక్కటి రష్యా మీద పడినా 3వ ప్రపంచ యుద్ధమే

అమెరికా అధ్యక్షుడిగా రెండు నెలల్లో దిగిపోనున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇందుకు కారణం అవుతుందా..? పరిస్థితులు చూస్తుంటే ఇదే జరుగుతుంది అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 9:22 AM GMT
‘లాంగ్ రేంజ్ మిస్సైల్’..ఒక్కటి రష్యా మీద పడినా 3వ ప్రపంచ యుద్ధమే
X

దాదాపు 33 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుందా..? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల నాటో కూటమి ఒకవైపు.. రష్యా-చైనా-ఉత్తర కొరియా-ఇరాన్ మరోవైపు నిలిచి తలపడనున్నాయా..? అమెరికా అధ్యక్షుడిగా రెండు నెలల్లో దిగిపోనున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇందుకు కారణం అవుతుందా..? పరిస్థితులు చూస్తుంటే ఇదే జరుగుతుంది అనిపిస్తోంది.

ఒక్క నిర్ణయం..

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నాటో కూటమి తరఫున, సొంతంగా ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క నిబంధన ఇంతకాలం ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారకుండా కాపాడింది. అదేమంటే.. అమెరికా అందించే దీర్ఘ శ్రేణి క్షిపణులను (లాంగ్ రేంజ్ మిస్సైళ్లు) ఉక్రెయిన్.. రష్యా భూభాగం మీదకు ప్రయోగించేందుకు అనుమతి లేదు. దీంతో తమ దేశంలోనే వాటిని రష్యా సైన్యం మీద ప్రయోగించాలి. ఇప్పుడు బైడెన్ వాటిని రష్యా భూ భాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అనుమతిచ్చారు. ఇదే అంశం ఇప్పుడు ప్రపంచానికి కంగారు పుట్టిస్తోంది.

ఏం జరుగుతుంది?

నష్టం అధికంగా కలిగించే దీర్ఘ శ్రేణి క్షిపణులను తమ దేశంపైకి ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా ఇప్పటికే గట్టిగా హెచ్చరించింది. దీంతో బైడెన్ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. దీనికితగ్గట్లే బైడెన్‌ నిర్ణయంపై మండిపడింది. తమ గడ్డపై అమెరికా క్షిపణులు పడితే తగిన విధంగా బదులిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తేల్చి చెప్పినట్లు రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఇది ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

అణు యుద్ధమేనా?

దాదాపు రెండు నెలల కిందటే అణు విధానాన్ని భారీగా సవరించింది రష్యా. తమ గడ్డపై కనీసం డ్రోన్ దాడి జరిగినా అణ్వాయుధ వినియోగం అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అంతేగాక రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పాశ్చాత్య దేశాలు ఆమోదం తెలిపితే... నాటో, అమెరికా, యూరప్ నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లేనని పుతిన్‌ సెప్టెంబరు 12నే హెచ్చరించారు. నాటో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. అటు నాటో, ఇటు అమెరికా కోసం వేర్వేరు వ్యూహాలను సిద్ధం చేసి పెట్టామని తెలిపారు. సవరించిన రష్యా అణు విధానం ప్రకారం.. పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే.. అణ్వాయుధాలు నేరుగా వాడొచ్చు. అంటే దీర్ఘ శ్రేణి క్షిపణి గనుక రష్యా గడ్డపై పడితే అది పశ్చిమ దేశాల దాడి అన్నమాటే.దీనిని మూడో ప్రపంచ యుద్ధం వైపు తమను నెట్టే చర్యగా రష్యా చెబుతోంది.

ఉత్తర కొరియానే కారణం..

పోతూ పోతూ బైడెన్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే.. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైన్యం రష్యాకు మద్దతుగా పాల్గొనడమేనని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తన నిర్ణయాన్ని బైడెన్‌ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బైడెన్‌ అనుమతించిన ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టం (ఏటీఏసీఎంఎస్‌) ఆయుధాల సామర్థ్యాలను పరిశీలిస్తే.. అవి 375 పౌండ్ల బరువైన పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. 300 కి.మీ.(190 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టం (హెచ్‌ఐఎంఏఆర్‌ఎస్‌) ద్వారా ఏటీఏసీఎంఎస్‌ లను ప్రయోగించవచ్చు. హెచ్‌ఐఎంఏఆర్‌ ఎస్‌ లను కూడా అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్‌ కు ఇచ్చింది. మొదటి తరం ఏటీఏసీఎంఎస్‌లు 950 బాంబులను జారవిడవగలవు. వీటితో రష్యా ఆయుధాగారాలు, చమురు క్షేత్రాలు, యుద్ధ సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటాయి.