Begin typing your search above and press return to search.

'రాజ‌కీయం' భార‌త్‌లోనే కాదు.. అమెరికాలోనూ సేమ్ టు సేమ్‌!!

ఈ ఏడాది న‌వంబ‌రు 5న అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

By:  Tupaki Desk   |   13 July 2024 5:37 PM GMT
రాజ‌కీయం భార‌త్‌లోనే కాదు.. అమెరికాలోనూ సేమ్ టు సేమ్‌!!
X

రాజ‌కీయం అంటే రాజ‌కీయ‌మే. అది భార‌త దేశ‌మే కాదు.. 'ఏదేశ‌మేగినా..' సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగానే ఉందని అంటున్నారు అంత‌ర్జాతీయ పొలిటిక‌ల్ పండితులు. ఒక పార్టీలో ఉండి.. ఆ పార్టీలోనే చిచ్చు పెట్టే నాయ‌కులు.. ఇటీవ‌ల జ‌రిగిన భార‌త సార్వత్రి క ఎన్నిక‌ల్లో చాలా మంది క‌నిపించారు. వీరిపై పార్టీలు చ‌ర్య‌లు కూడా తీసుకున్నాయి. వారు ఆయా పార్టీల గెలుపును ఆప లేక‌పోయినా.. మెజారిటీల‌ను త‌గ్గించారు. మ‌రికొన్ని పార్టీల్లో గెలుపును శాసించి.. ఓట‌మిని చ‌వి చూసేలా చేశారు. ఇది భార‌త రాజ‌కీయం. ఇక‌, ఇప్పుడు అగ్ర‌రాజ్యం రాజ‌కీయం కూడా.. సేమ్ టుసేమ్ అన్న‌ట్టుగానే ఉంది.

ఈ ఏడాది న‌వంబ‌రు 5న అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ఏడాదిన్న‌ర‌గా కీల‌క పార్టీలైన అధికార డెమొక్రాట్లు, ప్ర‌తిప‌క్ష రిప‌బ్లిక‌న్ల మ‌ధ్య పోరు తీవ్రంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్యక్ష అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. గెలుపు త‌న‌దేన‌ని.. ఎవ‌రైనా త‌న ముందు చిత్తు కావాల్సిందేన‌ని తేల్చి చెబుతున్నా రు. ఎక్క‌డ ఏ స‌మావేశం పెట్టినా.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ డెమొక్రాట్ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రోవైపు.. అధికార డెమొక్రాటిక్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ పోటీలో ఉన్నారు.

అయితే.. ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌నేది.. చ‌ర్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త నెల 27న జ‌రిగిన బ‌హిరంగ చ‌ర్చ‌ల్లో ట్రంప్‌తో చ‌ర్చిస్తూ.. బైడెన్ త‌డ‌బ‌డ‌డం.. మ‌తిమ‌రుపుతో కొన్ని కీల‌క విష‌యాలు మ‌రిచిపోవ‌డం.. వంటివి ఆయ‌న‌పై నీలినీడ‌లు క‌మ్ముకునేలా చేశాయి. దీంతో సొంత పార్టీ డెమొక్రాటిక్‌లోనే కొంద‌రు ఎంపీలు ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రి నుంచి బైడెన్ త‌ప్పుకోవాలని, వారే వారికి దారివ్వాల‌ని.. ఆయ‌న ట్రంప్‌ను ఓడించ‌లేర ని కూడా చెబుతున్నారు. ఇది ఒక పార్ట్‌. స‌హ‌జంగానే ఏ పార్టీలో అయినా.. అసంతృప్తి ఉంటుంది.

కానీ, ఇక్క‌డే కీల‌క రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. ఇదే డెమొక్రాటిక్ నాయ‌కుడు, మాజీ ప్రెసిడెంట్ .. బ‌రాక్ ఒబామా.. బైడెన్‌పై వ్య‌తిరేక‌త‌ను తెర‌వెనుక పెంచి పోషిస్తున్నార‌ని.. ఆధారాల‌తో స‌హా.. కీల‌క మీడియా సీఎన్ ఎన్ ప్ర‌త్య‌క క‌థ‌నాలు వెలువ‌రించిం ది. ప్ర‌స్తుతం బైడెన్ ప్ర‌చారానికి నిధులు ఇస్తామ‌న్న అనేక మంది దాత‌లు వెన‌క్కి వెళ్లిపోయారు. దీంతో 9 కోట్ల డాల‌ర్ల‌ను కీల‌క ఎన్నికల స‌మ‌యంలో బైడెన్ కోల్పోయారు. దీని వెనుక బైడెన్ ఉన్నార‌నేది ఈ క‌థ‌నం సారాంశం. అంతేకాదు.. ఆధారాల‌ను కూడా బ‌య‌ట పెట్టింది.

ఇక‌, బైడెన్ అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్న వారి వెనుక కూడా.. ఒబామా ఉన్నార‌ని ఈ మీడియా తెలిపింది. మాజీ స్పీక‌ర్ నాన్నీ పెలోసీతో క‌లిసి.. ఒబామా చేస్తున్న రాజ‌కీయాలు వెలుగు చూడ‌డంతో అమెరికాలో ఇప్పుడు రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతేకాదు.. 'డెమొక్రాటిక్ ఫ్రాగ్స్‌' అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలావుంటే.. ఒబామా త‌న స‌తీమ‌ణి మిఛెల్‌ను అధ్య‌క్ష బ‌రిలో నిలిపేందుకే.. ఇలా తెర‌వెనుక 'రాజ‌కీయం' చేస్తున్నారంటూ.. బైడెన్ అనుకూల వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. సో.. మొత్తానికి రాజ‌కీయం అంటే రాజ‌కీయ‌మే అన్న‌ట్టుగా ఉంది.. అమెరికా రాజ‌కీయం!!