Begin typing your search above and press return to search.

బీస్ట్.. బైడెన్ కారు ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ప్రపంచానికి పెద్దన్న అమెరికా దేశానికి అధ్యక్షుడంటే మాటలా? ఆయన ప్రయాణించే కారును ఎంత అత్యాధునికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినందే

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:09 AM GMT
బీస్ట్.. బైడెన్ కారు ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
X

ప్రపంచానికి పెద్దన్న అమెరికా దేశానికి అధ్యక్షుడంటే మాటలా? ఆయన ప్రయాణించే కారును ఎంత అత్యాధునికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినందే. నేల మీద నడిచే ఈ అద్భుతానికి పేరు బీస్ట్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారుగా దీన్ని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశానికి వెళ్లి.. అక్కడ పర్యటిస్తున్నారంటే.. ఆయన ప్రయాణించే బీస్టు కార్లను ముందుగా తీసుకొచ్చి.. అక్కడి రోడ్ల మీద ట్రయల్ రన్ నిర్వహించి.. అధ్యక్షుల వారి కోసం సిద్ధం చేస్తారు. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వీలుగా సర్వం సిద్ధం కావటం తెలిసిందే.

20 దేశాల అధినేతలు.. ప్రధానులు పాల్గొనే ఈ సమ్మిట్ కు ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావు లేకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు సాంకేతికతను సిద్ధం చేస్తున్నారు. భారత్ అందించే సెక్యూరిటీతో పాటు సొంత భద్రతా ఏర్పాట్లను చేసుకుంటోంది అగ్రరాజ్యం. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాడే బీస్ట్ కారు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 9-10 తేదీల్లో దేశాధినేతల మధ్య సమావేశం జరిగినా.. అమెరికాఅధ్యక్షుల వారు మాత్రం ఏడో తేదీనే (ఈ రోజే) వస్తున్నారు. ఎనిమిదిన మోడీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. ఎయిర్ ఫోర్సు వన్ తో పాటు హెలికాఫ్టర్ల రక్షణగా ఆయన ల్యాండ్ అవుతారు. రోడ్ల మీద ప్రయణంలో ఆయన బీస్ట్ ను మాత్రమే వినియోగిస్తారు.

1963 నుంచి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించే అధినేతకు వినియోగించే కారును ఫస్ట్ కార్ గా వ్యవహరిస్తారు. కెన్నడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాడిలాక్ మోడల్ ను 2018లో అధ్యక్షుడి కాన్వాయ్ లో పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా.. ఈ కారు ఆ దేశానికి వెళ్లాల్సిందే. బీస్ట్ అంటే.. నాలుగు కాళ్లతో నడిచే అత్యంత డేంజరస్ యానిమల్ అని అర్థం.

బీస్ట్ ఎంత స్పెషల్ అంటే..

- కారు అద్దాలు 5 అంగుళాల మందంతో ఉంటాయి

- డోర్లు 8 అంగుళాల మందంగా ఉంటాయి

- అద్దాల్ని పాలీ కార్బొనేట్ తో 5 లేయర్లలో అద్దాల్ని తయారు చేస్తారు

- డ్రైవర్ విండో మాత్రమే 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది

- మిగిలిన కారు విండోలు ఏవీ తెరుచుకోవు.

- కారు లోపల డ్రైవర్ కు.. అధ్యక్షుల వారికి మధ్య అద్దం ఉంటుంది. అది కేవలం అధ్యక్షుల వారే దించగలరు.

- కారు అద్దాలన్నీ బుల్లెట్ ఫ్రూఫ్. రసాయన, జీవాయుధ దాడుల్ని తట్టుకోగలవు

- టైర్లు ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోవు. పంక్చర్ కావు.

- ఒకవేళ డ్యామేజ్ అయితే లోపల ఉండే స్టీల్ రీమ్ లతో ప్రయాణించే సత్తా దీని సొంతం

- బాంబు దాడుల్ని కూడా ఈ కారు తట్టుకోగలదు. ఎందుకంటే దీని బాడీని స్టీల్.. అల్యూమినియం.. టైటానియం.. సిరామిక్ తో తయారు చేశారు.

- అత్యవసర సమయాల్లో పానిక్ బటన్ తో పాటు ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ నకు సంబంధించిన బ్లడ్ బ్యాగులు ఇందులో ఉంటాయి.

- ఇంధన ట్యాంక్ ఎంత స్ట్రాంగ్ అంటే.. దేన్ని ఢీ కొట్టినా ఇది పేలదు

- ఈ కారును నడిపే డ్రైవర్ కు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చేత కఠినమైన శిక్షణ ఇస్తారు.

- అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుల వారిని ఎలా కాపాడాలో శిక్షణ ఇస్తారు. రోజూ.. డ్రైవర్ కు వైద్య పరీక్షలు జరుపుతారు.

- కమ్యూనికేషన్.. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఉంటుంది.కారు ఎక్కడికెళ్లినా పసిగట్టేయొచ్చు.

- అధ్యక్షుడి సీటుదగ్గర శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దీని ద్వారా అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుడు.. పెంటగాన్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు.

- అత్యవసర పరిస్థితుల్లో 180 డిగ్రీల జెడ్ టర్న్ తో కారను తప్పించేలా ట్రైనింగ్ ఇస్తారు.

- భద్రతా చర్యల్లో భాగంగా భారత్ కు 75 - 80 కార్లు తెస్తామని అమెరికా ప్రతిపాదిస్తే.. చర్చల తర్వాత 60కు తగ్గించారట.

- ఢిల్లీలోని మైర్య షెరటాన్ లో బైడెన్ ఉండనున్నారు. ఆయన రూం 14వ ఫ్లోర్ లో ఉంటుందట. ఆయన కోసం ప్రత్యేకంగా లిఫ్టు సిద్ధం చేశారట.