బిగ్ అలర్ట్... ఖాకీ సినిమాలో దొంగల బ్యాచ్ హైదరాబాద్ లో దిగిందంట!?
అమీన్ పూర్, మియాపూర్, మేడిపల్లి, మేడ్చల్, హయత్ నగర్, సూరారం ప్రాంతాల్లో వీరి కదలికలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
By: Tupaki Desk | 11 Oct 2024 5:53 AM GMT"ఖాకీ" సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో నార్త్ లోని మారుమూల గ్రామాల నుంచి ఓ దొంగల ముఠా దక్షిణ భారతదేశానికి వచ్చి పలు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తుంటుంది! ఆ సమయంలో అడ్డొచ్చినవారిపై విచక్షణా రహితంగా దాడులు చేస్తుంటుంది. దోపిడీ అనంతరం తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతుంటుంది.
వారికి డబ్బు కంటే ప్రధానంగా బంగారు నగsiలు దొంగిలించడంపైనే ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. ప్రతీ ట్రిప్పులోనూ వీలైనంత మేర బంగారం దోచుకుని తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోతుంటారు. వచ్చే ముందు పెద్ద ఎత్తున పూజలూ గట్రా చేస్తుంటారు! సరిగ్గా అదే తరహా బ్యాచ్ ఒకటి మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దిగిందని అంటున్నారు.
అవును... మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో గల కొన్ని ఆదివాసీ గ్రామాలకు చెందిన ముఠాలోని సభ్యులు వేర్వేరు రాష్ట్రాలను ఎంపిక చేసుకుని దోపిడీలు చేస్తుంటారు! వీరు దోపిడీకి ముందు ఎంతో నిష్టగా తమ గ్రామ దేవతకు పూజలు చేస్తారట. కనీసం అర కిలో బంగారం అయినా దొరకాలని ప్రార్థిస్తారట. అనంతరం పలు మారణాయుధాలతో రంగంలోకి దిగుతారట.
ఈ సమయంలో తాము ఎంచుకున్న ప్రాంతంలో చాలా ఓపికగా ఉండి.. ఎన్ని ఇళ్ల తాళాలు అయినా పగలగొట్టి.. అనుకున్న మొత్తం సాధించే వరకూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరంట. టార్గెట్ పూర్తైతే మాత్రం వెంటనే తమ సొంతూరికి వెళ్లిపోతారట. అనుకున్నట్లుగానే గ్రామదేవతకు మొక్కులు సమర్పిస్తారు. ఇదే “ధార్ ముఠా” తీరు!
వాస్తవానికి గతంలో కూడా ఇలాంటి బ్యాచ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరిగిందని చెబుతున్నారు. అయితే.. పోలీసులు పలువురిపై పీడీ యాక్ట్ లు ప్రయోగించడం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో 2022 లోనే వీరు నగరం వైపు చూడకుండా పారిపోయారని అంటున్నారు. అయితే.. తిరిగి నగర శివార్లలో తాజాగా ఎంట్రీ ఇచ్చారని చెబుతున్నారు.
ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్ నుంచి ట్రావెల్స్ బస్సుల్లో మేడ్చల్, కోంపల్లి, పలు ప్రాంతాలకు చేరుకుని, పగలంతా రెక్కీ నిర్వహించి, పోలీస్ పెట్రోలింగ్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో ఎవరైనా అడ్డుపడితే.. వారిని హతమార్చేందుకు కూడా వెనుకాడరట.
ఇప్పుడు ఈ బ్యాచ్ తిరిగి నగరంలోకి ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. అమీన్ పూర్, మియాపూర్, మేడిపల్లి, మేడ్చల్, హయత్ నగర్, సూరారం ప్రాంతాల్లో వీరి కదలికలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీనిపై పోలీసులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు!