ఫార్ములా ఈ-రేసు కేసుపై హైకోర్టులో విచారణ.. పోలీసులకు కీలక ఆదేశాలు
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
By: Tupaki Desk | 27 Dec 2024 10:05 AM GMTతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై ఈ రోజు విచారించిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కాగా.. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు రేవంత్‌రెడ్డి సర్కార్ సమయం అడిగింది. దీంతో ప్రభుత్వానికి సమయం ఇస్తూ మంగళవారానికి వాయిదా వేసింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను కూడా మంగళవారం దాక పొడిగించింది. అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో.. కేటీఆర్‌కు భారీ ఊరట లభించినట్టయింది.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించగా.. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. మరోవైపు ఫార్ములా ఈ-రేసు కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం అరెస్టుపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ దాన కిషోర్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. అయితే.. ఇప్పటివరకు వీరికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కాగా.. నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి సమాచారం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నోటీసులు ఇచ్చి వెంటనే విచారించి.. దాని ఆధారంగా అరెస్టులు సైతం ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.