Begin typing your search above and press return to search.

సీఎం సోదరుడికి భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు

మాదాపూర్ అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:37 AM GMT
సీఎం సోదరుడికి భారీ ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
X

హైదరాబాద్ నగరంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నాయి. దాంతో బడా, చోట తేడా లేకుండా అందరూ హడలిపోతున్నారు. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తోంది. ఉదయం నుంచే బుల్డోజర్లు తమ పనిని మొదలుపెడుతున్నాయి.

హైడ్రాకు చిన్నాపెద్దా తేడా లేదని, తమ కుటుంబసభ్యులు అక్రమంగా నిర్మించినా కూల్చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లోనూ చెప్పుకొచ్చారు. కేవలం అక్రమంగా నిర్మించారని నిర్ధారణ అయితే చాలు నిర్దాక్షిణ్యంగా కూల్చడమేనంటూ హైడ్రాకు సూచించారు. ఇందులో భాగంగానే సీఎం సోదరుడికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సూచించారు. అందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో తిరుపతి రెడ్డి కూడా నోటీసులపై స్పందించారు. తాను ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, ఒకవేళ ఉంటే మాత్రం కూల్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. కొందరు ముందస్తుగానే కోర్టును ఆశ్రయిస్తున్నారు. హైడ్రాను నిలువరించాలని పిల్ దాఖలు చేస్తున్నారు. తమ నిర్మాణాలను కూల్చకుండా స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దుర్గం చెరువు పరిధిలోని పలువురికి హైడ్రా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దాంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ధర్మాసనం వారికి భారీ ఊరటనిచ్చింది. దుర్గం చెరువు పరిధిలోని నివాసితుల ఇళ్లు కూల్చివేతలపై స్టే విధించింది. అయితే.. అనూహ్యంగా దుర్గం చెరువు పరిధిలోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఈ తీర్పుతో ఆయనకు కూడా భారీ ఊరట లభించింది.

2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు బాధితులు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తాజా హైకోర్టు తీర్పులో భాగంగా వచ్చేనెల 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు లేక్ నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అటు లేక్ పరిరక్షణ కమిటీకి కూడా కీలక సూచన చేసింది. అక్టోబర్ 4 తరువాత ఆరు వారాల్లో ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించింది. ఇక ఇప్పుడు దుర్గం చెరువు పరిధిలోని నిర్వాసితుల భవిష్యత్ అంతా కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చేతిలో ఉండిపోయిందనే చెప్పాలి.