Begin typing your search above and press return to search.

ఓలా ఎలక్ట్రిక్ కు బిగ్ షాక్... సీసీపీఏ షోకాజ్ ఎందుకంటే..?

ఓలాకు తగినన్ని సర్వీసు సెంటర్స్ లేవని.. దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పేర్కొంటూ తొలుత కమెడియన్ కునాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 8:30 PM GMT
ఓలా ఎలక్ట్రిక్  కు బిగ్  షాక్... సీసీపీఏ షోకాజ్  ఎందుకంటే..?
X

ఎలక్ట్రికల్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఇటీవల కాలంలో దారుణంగా పతనమవుతున్న సంగతి తెలిసిందే! ఇటీవల స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో నమోదైన ఈ కంపెనీ సుమారు 43% క్షీణించినట్లు వారం క్రితం వార్తలొచ్చాయి. ఆ కంపెనీ సీఈవో భవీశ్, ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ మధ్య ఎక్స్ లో నడిచిన వివాదమే దీనికి కారణమనే కామెంట్లూ వినిపించాయి.

ఓలాకు తగినన్ని సర్వీసు సెంటర్స్ లేవని.. దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పేర్కొంటూ తొలుత కమెడియన్ కునాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన భవిశ్ అగర్వాల్... నీ కామెడీ కెరీర్ పూర్తవ్వడంతో ఇలాంటి పెయిడ్ పోస్టులు పెడుతున్నావా అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారం నెట్టింట పెద్ద రచ్చే లేపింది. ఈ సమయంలో తాజాగా సీసీపీఏ ఎంట్రీ ఇచ్చింది!

అవును... టూవీలర్ వాహన నాణ్యత, విక్రయం అనంతరం సేవలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎందుకు సకాలంలో స్పందించడం లేదు అని ప్రశ్నిస్తు... ఓలా ఎలక్ట్రిక్ కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో.. ఏడాది కాలంలో ఓలా ఎలక్ట్రిక్ పై 10వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.

దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో... ఓలా ఎలక్ట్రిక్ పై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ (ఎన్.సీ.హెచ్) కు కూడా ఫిర్యాదులు అందుతున్నాయని.. వీటిపై కంపెనీలోని అత్యున్నత స్థాయి వర్గాలను సంప్రదించినప్పటికీ ఫలితం లేదని.. విక్రయానంతరం వినియోగదారుల సమస్యల పరిష్కారం విషయంలో ఆసక్తి చూపలేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సీసీపీఏ రంగంలోకి దిగి పరిశీలించగా... ఎన్.సీ.హెచ్.కు సుమారు 10వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లు గుర్తించిందని అంటున్నారు. వీటిలో ప్రధానంగా... ఛార్జింగ్, ఫ్రీ సర్వీస్, వారంటీ, సర్వీస్ చేసినా లోపాలు పునరావృతం కావడం, అధిక మొత్తంలో రుసుములు ప్రధానంగా ఉన్నాయని అంటున్నారు.

దీంతో... అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ జారీ చేసిన సీసీపీఏ... ఈ నోటీసుపై స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్ కు 15 రోజుల గడువునిచ్చింది. ఇలా తమకు నోటీసు వచ్చిన విషయాన్ని స్టాక్ మార్కెట్లకు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. గడువు లోగా స్పందిస్తామని వెల్లడించింది. దీంతో... బిజినెస్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.