మంత్రి పొంగులేటికి బిగ్ షాక్!
సెప్టెంబర్ 27న తెల్లవారుజామునే ఈడీ బృందాలు పొంగులేటి నివాసానికి చేరుకున్నాయి.
By: Tupaki Desk | 27 Sep 2024 5:37 AM GMTతెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన కార్యాలయాలు, నివాసాల్లో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో మొత్తం 15 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 27న తెల్లవారుజామునే ఈడీ బృందాలు పొంగులేటి నివాసానికి చేరుకున్నాయి. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భద్రతతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి గతేడాది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు దక్కాయి.
అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కనస్ట్రక్షన్స్ అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, వంతెనలు ఇతర నిర్మాణ పనుల్లో ఉంది. భారీ కాంట్రాక్టు పనులు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో ఆదాయానికి తగ్గట్టు ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించకపోవడం, మనీలాండరింగ్ వంటి ఆరోపణలతో ఈడీ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గతేడాది కూడా నవంబర్ 3న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలతోపాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవ ఫ్రైడ్ లోనూ అధికారులు తనిఖీలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సోదాల సందర్భంగా ఆయన ఇంట్లోనే ఉన్నారా, లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఆయన అనుచరులు కూడా ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. దాడులు పూర్తయ్యాక ఈడీ అధికారులు దీనిపైన ప్రకటన చేస్తారని సమాచారం.
కాగా ఖమ్మంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10కి 9 స్థానాలను గెలవడంలో కీలక పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం చర్చకు దారితీసింది.