మీకు ఎవరైనా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు షేర్ చేశారా..?
అవును... ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునుంచే వాట్సప్ లలో "ఎగ్జిట్ పోల్స్" అని, "ఇంటెలిజెన్స్ రిపోర్ట్" అని కొన్ని ఎన్నికల ఫలితాలు షేర్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 16 May 2024 3:49 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది.. ఎగ్జాట్ ఫలితాల కోసం జూన్ 4 వరకూ వేచి చూడాలి. ఈలోపు జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి! ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 1 కంటే ముందు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెళ్లడించడానికి వీలు లేదు. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే ఎవ్వరైనా అంచనాలను బయటపెట్టాలి.
అయితే ఈ లోపు ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలని, ఇంటిలిజెన్స్ ఫలితాలనీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే... వీటిని జనాల్లోకి వదలడం వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉందని అంటున్నారు. ఆ ఫలితాలను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని చెబుతున్నారు. దీనికి సంబంధించిన బిగ్ అలర్ట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అవును... ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునుంచే వాట్సప్ లలో "ఎగ్జిట్ పోల్స్" అని, "ఇంటెలిజెన్స్ రిపోర్ట్" అని కొన్ని ఎన్నికల ఫలితాలు షేర్ అవుతున్నాయి. ఆయా సంస్థలు ఎలాగైతే ఫలితాలను విడుదల చేస్తాయో.. ఎగ్జాట్ గా అదే ఫార్మేట్ లో ఫలితాలను విడుదల చేస్తున్నారు. వెన్ డైగ్రమ్స్ తో కలిపి వదులుతున్నారు.
దీంతో... ఆయా సోషల్ మీడియా గ్రూప్స్ లలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఫలితాలు కాస్త పేరున్న సంస్థల పేరున వెలుగులోకి రావడంతో చాలా మంది జనాలు ఇవి నిజమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలే అని నమ్ముతున్నారని తెలుస్తుంది. ఫలితంగా... వాటిని నమ్మి బెట్టింగ్స్ కి కూడా దిగుతున్నారని అంటున్నారు.
తాజాగా వెలుగులోకి వస్తున్న ఒక సంచలన విషయం ఏమిటంటే... కొన్ని జిల్లాల్లో ఆయా పార్టీలకు చెందిన నేతలే ఆయా సంస్థల పేరు చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని.. వారి అనుచరులతోనే బెట్టింగ్ మొదలుపెట్టిస్తున్నారని.. ఆ విధంగా స్ప్రెడ్ చేసి.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము కొంతైనా రికవరీ చేసే ఆలోచనలో ఉన్నారనే చర్చా తెరపైకి వస్తుంది.
ఇదే సమయంలో... పలువురు కీలక వ్యక్తులు కావాలనే ఓడిపోతున్న పార్టీలకు పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చి.. ఆ విషయాన్ని జనాల్లో బాగా ప్రచారం చేసి.. ఫలితంగా బెట్టింగ్ కు అమాయకులను ప్రోత్సహించి డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో ఆక్టోపస్ ల విషయంలో అయినా, ఇంకెవరి విషయంలో అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జూన్ 1కి ముందు విడుదల అవుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కేవలం ఫేక్ అని! అవి కేవలం బెట్టింగ్ చేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు ఆడుతున్న రాక్షస క్రీడ అని చెబుతున్నారు. అందువల్ల ఈ నకిలీ ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతా కోరుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ జరుగుతున్నాయనే సమాచారం అందడంతో పోలీసులు, ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. బెట్టింగ్ బ్యాచ్ లోవాళ్లే పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే సమాచారమూ అందుతుంది! ఒకవేళ పోలీసులకు చిక్కితే పరిస్థితి రెంటికీ చెడ్డ రేవటిలా అవుతుందనే విషయం బెట్టింగ్స్ వైపు చూసేవాళ్లు గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు.