Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్కెట్' కాదు బ్యాడ్ బాస్కెట్: తనిఖీలతో షాకింగ్ నిజాలు!

ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు.. చక్కటి ప్యాకింగ్ తో ఇంటికి సామాన్లు తీసుకొచ్చే బిగ్ బాస్కెట్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   25 May 2024 5:05 AM GMT
బిగ్ బాస్కెట్ కాదు బ్యాడ్ బాస్కెట్: తనిఖీలతో షాకింగ్ నిజాలు!
X

ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు.. చక్కటి ప్యాకింగ్ తో ఇంటికి సామాన్లు తీసుకొచ్చే బిగ్ బాస్కెట్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొద్ది కాలంగా ఆన్ లైన్ లోనే కాదు.. ఆఫ్ లైన్ లోనూ షోరూంలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్ లైన్ షోరూం సైతం అద్దాల తలుపులు.. ఏసీతో.. చూడచక్కని రీతిలో సిద్దం చేసి ఉంచే తీరు కనిపిస్తుంది. అయితే.. ఇదంతా పైకి షోకే తప్పించి.. లోపల మాత్రం దారుణ పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేలింది.

అనారోగ్య వాతావరణంలో చెడిన వస్తువులతో నిండిన గోదామును గుర్తించిన అధికారులు బిగ్ బాస్కెట్ కు నోటీసులు ఇవ్వటమే కాదు.. గోదాము లైసెన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బిగ్ బాస్కెట్ కాదు బ్యాడ్ బాస్కెట్ అన్న మాటలు పలువురి నోట వినిపిస్తున్న పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కొండాపూర్ లోని మసీద్ బండ ప్రాంతంలో బిగ్ బాస్కెట్ కు సంబంధించిన గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ తనిఖీల్లో గడువు తీరిన మసాలాలు మాత్రమే కాదు నూనెతో తడిచిన నిత్యవసరాలు.. సరిగా భద్రపరచని డెయిరీ ఉత్పత్తులు.. గడువు తీరిన చికెన్ మసాలా.. సాస్ లు.. పిజ్జా చీజ్.. పనీర్ ఇలా పలు వస్తువులు అనారోగ్య వాతావరణంలోఉంచినట్లుగా గుర్తించారు.

దీంతో.. అవాక్కైన అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా గోదాము లైసెన్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని పలు హోటళ్లు.. రెస్టారెంట్లు.. సూపర్ మార్కెట్లను పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేరు మోసిన హోటళ్లు.. రెస్టారెంట్లు.. కాఫీ షాపులు.. చివరకు ఐస్ క్రీం షాపుల్లోనూ అనారోగ్య వాతావరణంతో కూడిన వస్తువుల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. పేరున్న బ్రాండ్ సూపర్ మార్కెట్ గోదాములో ఇలాంటి పరిస్థితి ఉండటం షాకింగ్ గా మారింది.