Begin typing your search above and press return to search.

ఒక్కటిగా ఇండియా కూటమి పోటీ....మోడీకి పెను సవాల్

ఎన్నికలు ఎపుడు వచ్చినా అంతా ఒక్కటిగా నిలిచి మోడీ సర్కార్ మీద పోరాడాలని విపక్ష శిబిరం నుంచి ప్రత్యర్ధి ఒక్కరే ఉండాలని కూడా నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:27 PM GMT
ఒక్కటిగా ఇండియా కూటమి పోటీ....మోడీకి పెను సవాల్
X

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎక్కడికక్కడ సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీకి దిగాలని డిసైడ్ అయింది. ఎన్డీయే కూటమికి ఎక్కడికక్కడ ఒకే ఒక ప్రత్యర్ధిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

రెండు రోజుల పాటు ముంబై లో జరిగిన ఇండియా కూటమి కీలకమైన అడుగులు వేసింది. ఎన్నికలు ఎపుడు వచ్చినా అంతా ఒక్కటిగా నిలిచి మోడీ సర్కార్ మీద పోరాడాలని విపక్ష శిబిరం నుంచి ప్రత్యర్ధి ఒక్కరే ఉండాలని కూడా నిర్ణయం తీసుకుంది.

ఇండియా కూటమికి సంబంధించి 28 పార్టీలకు చెందిన అరవైకి మందికి పైగా ప్రజా ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఇండియా కమిటీ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో అంతా కలసి పోటీకి దిగాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే అంశగా ఉంది.

అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసుకోవాలని మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కూడా ఆసక్తికరం. ఈ సీట్ల పంపిణీ ప్రక్రియ కూడా తక్షణం మొదలుపెట్టాలని కూటమి భావించడం కూడా వేగవంతమైన అడుగుగా భావిస్తున్నారు.

ఒక్కటే జెండా ఒక్కటే అజెండా ఉండాలని అది ఎన్డీయేను దించడమే అన్నది ఇండియా కూటమి ఆలోచనగా ఉంది. ఇక భారత్ ఏకమవుతోంది. ఇండియా గెలుస్తుంది అన్న నినాదంతో ముందుకు పోవాలని కూడా ఇండియా కూటమి డిసైడ్ అయింది. ఈ విషయాలు అన్నీ ముందుకు తీసుకుని పోయేందుకు 14 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించారు.

ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, డీఎంకే నుంచి టీయార్ బాలు, అర్జేడీ నుంచి తేజశ్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్ రౌత్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత రాఘవ్ చద్దా, ఎస్పీ నుంచి జావేద్ ఆలీ ఖాన్, జేడీయూ నుంచి లలన్ సింగ్, సీపీఐ నుంచి డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మొహమ్మద్ ముఫ్తీ ఈ కమిటీలో ఉంటారు. ఇండియా కూటమిలో ఇదే అత్యున్నత కమిటీగా పేర్కొంటున్నారు.

మరో వైపు చూస్తే రానున్న రోజులలో దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని, ఇండియా కూటమి విధానాలకు తెలియచేయాలని కూడా తీర్మానించారు. మొత్తానికి చూస్తే ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నేపధ్యంలో వాయువేగంతో ఇండియా కూటమి నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తోంది. దీంతో ఎన్డీయేకి అసలైన సవాల్ ఈసారి ఇచ్చేందుకు, 2024 ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఇండియా కూటమి దూకుడు చేస్తోంది అని అంటున్నారు.