బిగ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి.. రాజకీయ విమర్శలు
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలిక సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.
By: Tupaki Desk | 17 July 2024 4:30 PM GMTఇటీవల కాలంలో తరచుగా పోలీసులకు-మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయా కాల్పుల్లో ఒకరిద్దరు మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇదేసమయంలో పోలీసులకు కూడా గాయాలవుతున్నాయి. అయితే.. కేంద్రం మావోయిస్టుల ఏరివేతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రంలోని మోడీ సర్కారు.. మరిన్ని బలగాలతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కూంబింగులు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లాలో చేపట్టిన కూంబింగులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏకంగా 12 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసు తూటాలకు బలయ్యారు.
గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జాము నుంచే కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య రాత్రి 8 గంటల వరకు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలిక సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఈ ఆపరేషన్లో కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నాయి. మూకుమ్మడి దాడులు చేయడంలో సిద్ధహస్తులైన బ్లాక్ క్యాట్స్‌ను వినియోగించినట్టు సమాచారం. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
బ్లాక్ క్యాట్స్‌ను ఉగ్రవాద నిరోధక చర్యలకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా.. వారిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు(మహారాష్ట్ర-ఛత్తీగఢ్) కూడా ఉలిక్కిపడ్డాయి. ఇదిలావుంటే.. గడ్చిరోలి పోలీసులు, సీ60 కమాండోలు(బ్లాక్ క్యాట్) ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. బ్లాక్ క్యాట్ అని వారు చెప్పకపోయినా.. స్థానిక మీడియా మాత్రం వారు బ్లాక్ క్యాట్ కమాండోలుగా పేర్కొంది. దీంతో రాజకీయ రచ్చకు దారితీసింది.
భారీ వర్షంలోనూ..
ఛత్తీస్ గఢ్ - మహారాష్ట్రలోని గడ్చిరోలి సరిహద్దుల్లో ఉన్న కాంకేర్ సమీపంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు, కమాండోలు అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే.. పోలీసు బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కీలక నాయకులు ఉన్నట్టు తెలిపారు.