Begin typing your search above and press return to search.

భీమిలీ కోసం జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్...!

1983 నుంచి చూస్తే ఇప్పటికి తొమ్మిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే తెలుగుదేశం భీమిలీ నుంచి ఆరు సార్లు గెలిచింది.

By:  Tupaki Desk   |   11 Feb 2024 3:27 AM GMT
భీమిలీ కోసం జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్...!
X

విశాఖ జిల్లాలో భీమిలీ సీటు ఇపుడు మిత్ర పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. భీమిలీని ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చేది లేదని టీడీపీ అంటోంది. భీమిలీ టీడీపీకి కంచుకోట. 1983 నుంచి చూస్తే ఇప్పటికి తొమ్మిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే తెలుగుదేశం భీమిలీ నుంచి ఆరు సార్లు గెలిచింది. కేవలం మూడంటే మూడు సార్లు మాత్రమే ఇతర రాజకీయ పార్టీలు గెలిచాయి.

భీమిలీ నుంచి 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ గెలిచాయి. అయినా టీడీపీకి ఏ రోజూ తక్కువగా ఓట్లు రాలేదు. 2004లో జస్ట్ మూడు వందల ఓట్లతో ఓడిపోతే 2009లో ఆరు వేల ఓట్లతో 2019లో తొమ్మిది వేల ఓట్లతోనూ ఓటమి పాలు అయింది. అలా భీమిలీలో టీడీపీ బలంగా ఉందని నిరూపించుకుంది.

అయితే 2019లో భీమిలి నుంచి మొదటిసారి పోటీ చేసిన జనసేనకు 24 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. దాంతో జనసేన ఈ సీటు కోసం పట్టుబడుతోంది. అంతే కాదు ఈ సీటుని 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుచుకుంది. దాంతో ఈ సీటుని వదిలేది లేదు అని అంటోంది. అయితే టీడీపీకి 2019 ఎన్నికల్లో 92 వేల ఓట్లు వచ్చాయి. జనసేన కంటే ఎంత బలంగా ఉన్నామన్నది ఈ ఓట్లే చెబుతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే భీమిలీ విషయంలో టీడీపీ లోకల్ లీడర్స్ తో పాటు హై కమాండ్ కూడా సెంటిమెంట్ గానే చూస్తోంది. డ్యాం ష్యూర్ గా విశాఖ జిల్లాలో భీమిలీని గెలుచుకోగలమని అలాంటి సీటు పొత్తులో భాగంగా కట్టబెడితే తమకు ఫ్యూచర్ లో భీమిలీ అందదేమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట.

మరి హై కమాండ్ వ్యూహాలో లేక వేరే రకంగా వచ్చిందో తెలియదు కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇపుడు భీమిలీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి ఏకంగా 37 వేల పై చిలుకు మెజారిటీని సాధించారు. అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు.

ఆయనకు భీమిలీలో బలమైన అనుచర గణం ఉంది. అందుకే హై కమాండ్ గంటాను భీమిలీ వైపు తీసుకుని వస్తోందా అన్న చర్చ నడుస్తోంది. గంటా ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇటీవలే స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. దాంతో గంటా విశాఖ ఉత్తరం వైపు మళ్లీ చూడదలచుకోవడంలేదు.

ఆయన భీమిలీ నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. దాని కోసం ఆయన సర్వేలు కూడా చేయించుకున్నారు. ఆ సర్వేలలో గంటా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు అని వచ్చింది. దాంతో గంటా హుషార్ గా ఉన్నారు. ఆయనకు అంగబలం అర్ధ బలం ఉంది. అంతే కాకుండా హై కమాండ్ వద్ద పలుకుబడి ఉంది.

దాంతో గంటా భీమిలీ నుంచి పోటీ అన్న వార్తలు గుప్పుమనడంతో జనసేన అలెర్ట్ అయింది. గంటా వంటి బిగ్ షాట్ బరిలోకి దిగితే భీమిలీ సీటు దక్కదేమో అన్న కంగారు ఆ పార్టీ లీడర్లలో ఏర్పడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సైతం భీమిలీ సీటుని ప్రతిష్టగా తీసుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలోనూ భీమిలీని వదులుకోమని నేతలకు చెబుతున్నట్లుగా ప్రచారంలో ఉంది.

అయితే గంటాకు టికెట్ దక్కకుండా టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గం కూడా కృషి చేస్తోంది. భీమిలీ టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ మండలాధ్యక్షుడు కోరాడ రాజబాబు టికెట్ ఇస్తే తనకు ఇవ్వాలని కొత్త డిమాండ్ తో ముందుకు వస్తున్నారు. పొత్తులు లేకపోతే సీటు నాది అని ఆయన అంటున్నారు. దీంతో టీడీపీలో కూడా సీటు కోసం ఫైటింగ్ మొదలైంది.

ఇవన్నీ ఇలా ఉంటే జనసేన మాత్రం భీమిలీ సీటు విషయంలో ఎందాకైనా అంటోంది. ఆ పార్టీ భీమిలీ ఇంచార్జి పంచకర్ల సందీప్ నే మరోసారి పోటీ చేయించాలని చూస్తున్నారు. బిగ్ షాట్స్ టీడీపీ నుంచి దిగాలనుకుంటే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ని భీమిలీ నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. అలా బీసీ కార్డుని వాడి అయినా భీమిలీ సీటు దక్కించుకోవాలని అనుకుంటోందిట. మొత్తానికి చూస్తే భీమిలీ వేదికగా మిత్రుల మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది అని అంటున్నారు.