హిమాచల్ రాజకీయ సంక్షోభంలో అతిపెద్ద ట్విస్ట్!
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి 40 మంది సభ్యులున్నారు.
By: Tupaki Desk | 29 Feb 2024 8:22 AM GMTదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి 40 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వి సులువుగా గెలవాల్సి ఉంది. అయితే బీజేపీకి బలం లేకపోయినా తమ పార్టీ తరఫున హర్ష్ మహాజన్ ను బరిలో దింపింది. దీంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. అలాగే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా హర్ష్ మహాజన్ కే ఓటేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వికి 34 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కు 34 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో విజేతను నిర్ణయించడానికి లాటరీ తీయగా విజయం హర్ష్ మహాజన్ ను వరించింది.
ఈ నేపథ్యంలో ఆరుగురు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓట్లేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు.
ఎమ్మెల్యే పదవులు పోగొట్టుకున్నవారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్ పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్రదత్ లఖన్ పాల్ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను తమలో కలుపుకుని హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ పెద్ద స్కెచ్ వేసింది. బీజేపీకి ఉన్న 25 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆరుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో బీజేపీ బలం 34కు చేరుతుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40 స్థానాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆరుగురు బయటకు పోవడంతో 34 స్థానాలకు పరిమితమైంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చెరో 34 స్థానాలతో నిలబడ్డాయి.
ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని.. మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ ను కలవడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ను ధిక్కరించి బీజేపీకి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో వారిపై స్పీకర్ ద్వారా వేటు వేయించింది. దీంతో హిమాచల్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ను రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు.
అధికార పక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం తొలగింపుతోపాటు బీజేపీకి చెందిన 15 ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడంతో మూజువాణి ఓటుతో బడ్జెట్ శాసనసభ ఆమోదం పొందింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకున్నటై్టంది.