Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం ఈ భేటీ ఏ దరికి?

ఎందుకు కలిశారు? ఏం చర్చించారనే అంశాలపై స్పష్టత లేనప్పటికీ ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది.

By:  Tupaki Desk   |   29 July 2024 10:01 AM GMT
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం ఈ భేటీ ఏ దరికి?
X

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మతో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని నివాసంలో విజయమ్మను జేసీ ప్రభాకర్‌ రెడ్డి కలిశారు. ఎందుకు కలిశారు? ఏం చర్చించారనే అంశాలపై స్పష్టత లేనప్పటికీ ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది.


గతంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. వైఎస్‌ జగన్‌ ను దూషించారు. ‘నీ య.. నా.. కొ..కా’ అంటూ చెప్పలేని, రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్‌ పై భారీ ఎత్తున కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డే ఎక్కువ కేసులను ఎదుర్కొన్నారు.


వైఎస్సార్‌ ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. అనంతపురం జిల్లాలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్‌ 2014లో టీడీపీలో చేరారు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా, అనంతపురం నుంచి ఎంపీగా జేసీ దివాకర్‌ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వీరికి బదులుగా వీరిద్దరి కుమారులు బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవల ఎన్నికల్లో జేసీ కుటుంబంలో ఒక్కరికే సీటు దక్కింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి విజయం సాధించారు.


జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్‌ గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. దీంతో జేసీ ప్రభాకర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పుడు ఉన్నట్టుండి వైఎస్‌ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆయన ఎందుకు కలిశారనేది ఇంకా వెల్లడి కాలేదు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, విజయమ్మ సోఫాలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం, విజయమ్మ చేతిలో సాసర్, టీ కప్పు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

అసలు ముందు ఎవరిని ఎవరు కలిశారనేది కూడా మీడియాకూ తెలియలేదు. చివరకు జేసీ ప్రభాకర్‌ రెడ్డే హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో విజయమ్మను కలిశారని తేలింది. సుమారు అరగంటకు పైగా జేసీ అక్కడ ఉన్నారని తెలిసింది. ఈ సందర్భంగా విజయమ్మ ఆరోగ్య పరిస్థితిని ప్రభాకర్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల ప్రస్తావన కూడా విజయమ్మ, జేసీ ప్రభాకర్‌ రెడ్డి భేటీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. కేవలం విజయమ్మను పరామర్శించడానికే జేసీ ఆమె ఇంటికి వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అంటున్నారు.