వసుంధర రాజేకు మోడీ షాల బిగ్ షాక్...సీఎం అభ్యర్ధిగా దియా కుమారి...!
రాజస్థాన్ లో ఒక సంప్రదాయం ఉంది. అక్కడ గెలిచిన పార్టీ మరోసారి గెలవదు.
By: Tupaki Desk | 22 Oct 2023 4:03 AM GMTరాజస్థాన్ లో ఒక సంప్రదాయం ఉంది. అక్కడ గెలిచిన పార్టీ మరోసారి గెలవదు. అలా 2013లో బీజేపీ గెలిస్తే 2018లో కాంగ్రెస్ గెలిచింది.ఇపుడు బీజేపీకి చాన్స్ వస్తుందని అంటున్నారు. ఇక రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత వసుంధారా రాజే ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి బీజేపీ గెలిస్తే మూడవసారి గెలవాలని చూస్తున్నారు. అయితే వసుంధరారాజేకు బీజేపీలోని పెద్దలు అయిన నరేంద్ర మోడీ అమి షాల నుంచే బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు.
ఆమె అంతటి సీనియర్ నేత అయినప్పటికీ మొదటి జాబితాలో బీజెపీ టికెట్ ఇవ్వలేదు. ఇక రెండవ జాబితాలో ఆమెతో పాటు కొందరు ఆమె అనుచరులకు మాత్రమే టికెట్ ఇవ్వడం ద్వారా మోడీ అమిత్ షా వసుంధరా రాజే నీ పక్కన పెడుతున్నారని అంటున్నారు. ఇక రాజస్థాన్ లో బీజేపీ బలపడడానికి కృషి చేసిన బైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకి ఈసారి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపడం విశేషం. ఆయన వసుంధరా రాజే అనుచరుడు అన్న కారణంతోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే రాజస్థాన్ సీఎం పదవికి వసుంధర రాజే వంటి సీనియర్ నేత ఉండగా ఆమె పేరు ప్రకటించకపోవడం విశేషం. అంతే కాదు ఎంపీగా అక్కడ తొలిసారి గెలిచిన దియా కుమారికు రజ్వీ 2018లో ఏకంగా ముప్పయి వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కంచుకోట లాంటి సీటు రాజసమంద్ కి కేటాయించడం విశేషం. ఇక దియా కుమారిని వసుంధరరాజేకు పోటీగా రెడీ చేస్తున్నారు అని అంటున్నారు.
అయితే కేవలం ఒకసారి ఎంపీగా మాత్రమే గెలిచిన దియా కుమారి రాజకీయ పరిపక్వత నాయకత్వ సామర్థ్యం మీద బీజేపీలోనే అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆమె వివాదాలకు కేరాఫ్ అని కూడా అంటున్నారు. అయితే ఆమె పట్ల బీజేపీ పెద్దలు మొగ్గు చూపడానికి కారణం ఆమె కూడా రాజ వంశీకురాలు కావడమే. రాజులు పోయినా రాజ్యాలు పోయినా కూడా రాజస్థాన్ లో ఆ కుటుంబాల రాజకీయ పలుకుబడి అపారంగా ఉంటూ వస్తోంది.
అలా వసుంధర రాజే రాజ కుటుంబీకురాలు అయితే ఆమెకు పోటీగా మరో కుటుంబీకురాలు అయిన దియాకుమారిని తీసుకుని వచ్చారని అంటున్నారు. ఇక దియా కుమారి తండ్రి బ్రిగేడియన్ భవనీసింగ్ గా ప్రసిద్ధి.ఆయన కాంగ్రెస్ రాజకీయాలలో మునిగి తేలిన వారు. ఆయన 1989లో మొదటి సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిని మూటకట్టుకున్నారు.
ఆయన వారసురాలిగా 2013లో బీజేపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన దియా కుమారి ఇపుడు వసుంధర రాజేకు అతి పెద్ద పోటీ అయ్యారు. చిత్రమేంటి అంటే ఆమెను బీజేపీ పెద్దలకు పరిచయం చేసింది వసుంధరా రాజే. అయితే దియాకు రాజేకు మధ్య 2016 తరువాత నుంచి గొడవలు స్టార్ట్ అయి ఈ రోజున అవి అగాధం అయ్యాయి. జైపూర్ రాజమహల్ ప్యాలెస్ హొటల్ విషయంలో వివాదం వచ్చింది.
అపుడు రాజస్థాన్ సీఎం గా వసుంధరా రాజే ఉన్నారు. ఈ హొటెల్ ని జైపూర్ డెవలప్మెంట్ అధారిటీ సీజ్ చేసింది. దాంతో దియా కుమారి, ఆమె తల్లి రాజమాత పద్మినీ దేవి ఏకంగా బహిరంగ విమర్శలకే దిగారు, వసుంధరా రాజే మీద వారు ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. అలా రాజుకున్న అగ్గి ఈ రోజు దాకా అలాగే ఉంది.
ఇక ఒక విషయంగా ఉంటే 2003లో మొదటిసారి వసుంధరా రాజే రాజస్థాన్ కి సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఆమెకు ఆరెస్సెస్ తో పడడంలేదు, ఆమెకు ఆల్టర్నేషన్ ని తయారు చేయాలని ఆరెస్సెస్ బీజేపీ పెద్దలకు సూచిస్తూనే ఉంది. అది ఇన్నాళ్లకు జరుగుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీకి గత పదేళ్ళుగా పూర్తి అధికారంతో నాయకత్వం వహిస్తున్న మోడీ, అమిత్ షాలతో వసుంధరా రాజెకు పెద్ద గ్యాప్ ఉంది. దాంతో ఇపుడు సరైన సమయంగా భావించి మోడీ అమిత్ షాలు చెక్ పెడుతున్నారు అని అంటున్నారు.
ఇక అపార అనుభవం కలిగిన వసుంధరా రాజేకి రాజస్థాన్ బీజేపీలో మంచి పట్టు ఉంది. మెజారిటీ ఆమె వర్గంగా ఉన్నారు. ఆమెను పక్కన పెట్టి ఏమీ అనుభవం లేని దియా కుమారిని ముందుకు తీసుకుని రావడం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బ తింటాయేమో అన్న డౌట్ ని కొంతమంది కమలనాధులు వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలిచేది బీజేపీ కానీ వసుంధరా రాజే కాదని, పార్టీ గెలుస్తుంది, నాయకులను పార్టీయే ఎన్నుకుంటుంది అన్న సూత్రంతో బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వసుంధర రాజేకు చెక్ పెట్టి చుక్కలు చూపించే పనిలో మోడీ షా టీం ఉంది అంటున్నారు.