బెజవాడలో వైసీపీకి బిగ్ షాక్!
2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున బొప్పన భవకుమార్ పోటీ చేశారు.
By: Tupaki Desk | 18 Jan 2024 3:00 AM GMTవిజయవాడలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని తదితరులతో కలిసి నారా లోకేశ్ ను కలిశారు. టీడీపీలో చేరడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున బొప్పన భవకుమార్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్న దేవినేని అవినాశ్ ను వైసీపీలో చేర్చుకున్న వైఎస్ జగన్ ఆయనను విజయవాడ తూర్పు ఇంచార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా అవినాశ్ కేనని స్పష్టం చేశారు.
దీంతో బొప్పన భవకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏదైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఏమీ ఇవ్వకపోవడం, తనకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడంతో బొప్పన భవకుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఇటీవల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. బొప్పన భవకుమార్ ను కలిసి చర్చలు జరిపారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే అప్పుడు భవకుమార్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. రాధా కలిసిన విషయం తెలిసిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాశ్ కూడా బొప్పన భవకుమార్ ను కలిశారు. పార్టీని వీడొద్దని.. మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే భవకుమార్ తాజాగా లోకేశ్ ను కలిసి టీడీపీలో చేరికకు సిద్ధమయ్యారు.
వైసీపీలో తనకి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని, పార్టీ కోసం పని చేసిన తనతోపాటు జలీల్ ఖాన్, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయ భానులకు గౌరవం లేదని బొప్పన భవకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో కలిసి తాను కూడా ఈనెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు బాంబుపేల్చారు. ఇప్పటికే వైసీపీని ఒక్కొక్కరూ వీడుతున్నారని.. తమ తర్వాత ఉదయ భాను వంతేనని వెల్లడించారు. వైసీపీలో ఎవ్వరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ వైసీపీలో పెత్తనం మొత్తం ఒకరి చేతిలోకి పోయిందని బొప్పన భవకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి సొంత నిర్ణయాలు వారివి తప్పితే వైసీపీలో ఎలాంటి గౌరవం లేదన్నారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి వైసీపీలో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు.