మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక వెనుక అంత బిగ్ స్కెచ్?
సీఎం రేసులో లేని మోహన్ యాదవ్ ను ఎంపిక చేయటం ద్వారా మోడీషాలు మరోసారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
By: Tupaki Desk | 12 Dec 2023 5:19 AM GMTఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు వారాలకు కానీ కీలకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని తేల్చలేదు బీజేపీ. ఒకవేళ.. కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి తీరునే ప్రదర్శించి ఉంటే.. ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ ఓ రేంజ్ లో హోరు ఉండేది. బీజేపీ గొప్పతనం ఏమంటే.. ఆ పార్టీ ఏం చేసినా ప్రశ్నించే పరిస్థితి పెద్దగా కనిపించదు. ఎప్పటిలానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆశ్చర్యకర రీతిలో ఎంపిక జరిగింది. సీఎం రేసులో లేని మోహన్ యాదవ్ ను ఎంపిక చేయటం ద్వారా మోడీషాలు మరోసారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఏ మాత్రం అనుభవం లేని మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్న ప్రశ్నకు భారీ స్కెచ్ ఉందన్న విశ్లేషణను రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. మరో ఆర్నెల్లలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మోడీ సర్కారు హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉందని.. అందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయంలో పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు పనికి వస్తుందన్న ఉద్దేశంతోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా నియమించినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.
2019తో పోలిస్తే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య మీద ప్రభావం పడుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కారణంతో.. సీట్ల సంఖ్యను పెంచుకోవటంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు బిహార్ లోనూ ఎక్కువ సీట్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 120ఎంపీ సీట్లు ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే.. ఈ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా యాదవ్ సామాజిక వర్గానికిచెందిన నేతను ఎంపిక చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ యాదవ జనాభా ఎన్నికల తీర్పును ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. దీనికి తోడు.. మోహన్ యాదవ్ సతీమణి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు కావటం ఒక కారణంగా చెబుతున్నారు. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్ పూర్ కు చెందిన వారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను ఎంపిక చేయటం ద్వారా మరో కొత్త ఫోర్సును తెర మీదకు తీసుకురావటం.. సమాజ్ వాదీ పార్టీ.. బీహార్ లోని ఆర్జేడీని లోక్ సభ ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు మోహన్ యాదవ్ ఒక అస్త్రంగా మారతారని భావిస్తున్నారు. ఈ భారీ వ్యూహమే ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటానికి సాయం చేసిందన్న మాట వినిపిస్తోంది. ఒక నేతను ముఖ్యమంత్రిగా నియమించే విషయంలో చాలా లోతుగా ఆలోచించే మోడీషాలు.. ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజమన్న విషయాన్ని తాజా ఎంపికతో మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పక తప్పదు.