'బిహార్' బడ్జెట్.. విమర్శల్లో నిజం ఎంత?
వరాలు.. జల్లులు ఇలా చూస్తే.. మొత్తంలో సింహభాగం.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ చుట్టూనే తిరిగింది.
By: Tupaki Desk | 1 Feb 2025 1:30 PM GMTకేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు.. వరాలు.. జల్లులు ఇలా చూస్తే.. మొత్తంలో సింహభాగం.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ చుట్టూనే తిరిగింది. ఒక ప్రాజెక్టు ఇచ్చారు.. అంటే ఓకే. రెండు వరాలు కురిపించారు.. అన్నా ఓకే. కానీ, యథాలాపంగా.. పదే పదే బిహార్ ప్రస్తావన చేయడం.. ఆ రాష్టానికే కేటాయింపులు ఇవ్వడం వంటివి విమర్శలకు దారి తీసింది. అన్ని పక్షాలు కూడా.. ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. 14 మంది ఎంపీలతో మోడీ సర్కారుకు భుజం కాస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఈ బడ్జెట్ సంతోషాన్ని కురిపిస్తోంది.
కేటాయింపులు ఎలా .. ఎలా..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంలో బిహార్.. బిహార్.. అనే పదాన్ని మొత్తం 17 సార్లు పలికారు. ఇక, బడ్జెట్‌లో వరాలను గమనిస్తే.. బీహార్‌లో రైతుల కోసం `మఖానా` బోర్డు ఏర్పాటు చేయనున్నారు. `మిథిలాంచల్` ప్రాంతంలో 50 వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే `వెస్టర్న్ కోసి కెనాల్`(కోసి నదిపై)కు ఆర్థిక సాయం చేయనున్నారు. రాజధాని పట్నాలోని కీలకమైన ఐఐటీ-పాట్నాను విస్తరించే ప్రణాళిక ఈ ఏడాది పూర్తి చేయనున్నారు. ఆహార తయారీ రంగానికి ఊతమివ్వనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చేందుకు బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
`సివిల్ ఏవియేషన్ పుష్`లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్రంలో రోడ్ ప్రాజెక్టులు, కొత్త ఎయిర్‌పోర్టు లు, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.26,000 కోట్లు, ఫ్లడ్ మిటిగేషన్ కోసం రూ.11,500 కోట్లు ఇవ్వనున్నారు. ఇది బిహార్ ఏర్పడిన తర్వాత.. కేంద్ర బడ్జెట్‌లో ఈ రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు. ఇది పూర్తిగా త్వరలోనే జరగనున్న ఎన్నికలనుదృష్టిలో పెట్టుకుని జరిపిన కేటాయింపులుగా విపక్షాలు చెబుతున్నాయి. ఇక, తాజాగా జరిగిన కేటాయింపులను చూసినా.. బిహార్ పైనే ఎక్కువగా మోడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.