కొత్త నేర చట్టాల కింద దేశంలో తొలి శిక్ష వారికే
ఈ చట్టాల కింద దేశంలోనే తొలిసారి శిక్ష పడిన దరిద్రపుగొట్టు క్రెడిట్ బిహార్ ఖాతాలో పడింది.
By: Tupaki Desk | 6 Sep 2024 5:17 AM GMTనేరాలు.. ఘోరాలు అన్నంతనే గుర్తుకు వచ్చే రాష్ట్రంగా నిలుస్తుంది బిహార్. గతంలో పోలిస్తే.. ఈ రాష్ట్రంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని హింసాత్మక ఘటనలు చూసినప్పుడు మాత్రం బిహార్ తీరులో ఎప్పుడు మార్పు వస్తుందన్న భావన కలుగుతుంది. ఇటీవల మోడీ సర్కారు దేశంలోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాల గురించి తెలిసిందే. ఈ చట్టాల కింద దేశంలోనే తొలిసారి శిక్ష పడిన దరిద్రపుగొట్టు క్రెడిట్ బిహార్ ఖాతాలో పడింది.
మూక దాడి కేసులో ప్రాణాలు తీసిన ఆరోపణల మీద కేసు నమోదైన ఉదంతంలో జీవిత ఖైదు శిక్ష పడటం ద్వారా.. కొత్త నేర చట్టాల కరకుదనం ఏమిటో అర్థమయ్యేలా ఉందని చెప్పాలి. ఈ ఏడాది జులై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత.. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత.. భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు అమలులోకి రావటం తెలిసిందే. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా శిక్ష పడింది. దేశంలో కొత్త చట్టాల కింద ఇదే మొదటి శిక్షగా చెబుతున్నారు. మొదటి శిక్షే.. జీవిత ఖైదు కావటం గమనార్హం.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేసు నమోదు చేసిన 48 రోజుల్లోనే శిక్ష ఖరారు కావటం. బిహార్ లోని శరణ్ జిల్లాలో జులై 17న మూక హత్యలు జరిగాయి. ధనాదీహ్ గ్రామానికి చెందిన తారకేశ్వర్ సింగ్ ఫ్యామిలీ పై దుండగులు దాడి చేశారు. డాబాపై నిద్రపోతున్న వారిపై విచక్షణరహితంగా పొడిచేశారు. ఈ ఉదంతంలో తారకేశ్వర్.. ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దారుణ ఉదంతంపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేవారు. ఘటన జరిగిన 14 రోజుల్లోనే వీరిపై రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు. వీరిపై చర్యలకు కోర్టులో వాదనలు మొదలుకాగా.. కేవలం 48 రోజుల వ్యవధిలోనే వీరికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. దీంతో.. కొత్త నేర చట్టాల కింద శిక్ష పడిన మొదటి కేసుగా నమోదైంది.