పిడుగుల వర్షం.. 13 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.. ఎక్కడంటే?
భారీ ఈదురు గాలులు.. వడగళ్ల వాన.. దీనికి తోడు వణికించే పిడుగుల వర్షం పెను విషాదానికి కారణమయ్యాయి.
By: Tupaki Desk | 10 April 2025 4:08 AMభారీ ఈదురు గాలులు.. వడగళ్ల వాన.. దీనికి తోడు వణికించే పిడుగుల వర్షం పెను విషాదానికి కారణమయ్యాయి. బిహార్ లో తాజాగా చోటు చేసుకునన పిడుగుల వర్షానికి పదమూడు మంది ప్రాణాలు కోల్పోయిన వైనం షాకింగ్ గా మారింది. బిహార్ రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో పడిన పిడుగుల ధాటికి ఇంత భారీగా ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు.
మధుబనీ, బెగూసరాయ్, దర్ బంగా జిల్లాల్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో బెగూసరాయ్.. దర్ బంగా జిల్లాల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది చనిపోయారు. మధుబనీ లో ముగ్గురు చనిపోగా.. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారే. సమస్తిపుర్ లో మరొకరు పిడుగు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఈ పెను విషాదంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. పిడుగుల ధాటికి 13 మంది మరణించటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సీఎం నితీశ్ కుమార్.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అకాల వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
పిడుగుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. 2023లో పిడుగుల ధాటికి ఆ రాష్ట్రంలో ఏకంగా 275 మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఇదే విషయాన్ని బిహార్ ఆర్థిక సర్వే రిపోర్టు వెల్లడించింది. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనల్ని రాష్ట్ర ప్రజలంతా పాటించాలని.. ప్రకృతి ప్రకోపం నుంచి బయటపడాలన్న సూచన చేస్తున్నారు. ఏమైనా.. పిడుగుల ధాటికి ఒకే రోజు ఒక రాష్ట్రంలో ఇంత మంది మరణించటం ఇటీవల కాలంలోచోటు చేసుకోలేదనే మాట వినిపిస్తోంది.