డబ్బాలో పాలు అన్నీ నేలపాలు... రాహుల్ గాంధీపై ఫిర్యాదు!
ఇందులో భాగంగా... తన క్యాన్ నిండా ఉన్న పాలు అన్నీ నేలపాలు అవడానికి రాహుల్ గాంధీ కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు.
By: Tupaki Desk | 21 Jan 2025 7:30 PM GMTతన పాల క్యాన్ కింద పడిపోయిందని.. అందులో ఉన్న పాలు అన్నీ నేలపాలు అయిపోయాయని.. అందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కారణమని.. ఆయన వల్లే తనకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బీహార్ కు చెందిన ముకేశ్ కుమార్ చౌదరి అనే పాల వ్యాపారి. ఈ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది!
అవును... ఓ విచిత్రమైన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తన క్యాన్ నిండా ఉన్న పాలు అన్నీ నేలపాలు అవడానికి రాహుల్ గాంధీ కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. సుమారు ఐదు లీటర్ల పాలు కింద పడిపోవడంతో సుమారు రూ.250 నష్టం వచ్చిందని తెలిపాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.
దేశంలోని ప్రతీ వ్యవస్థపైనా బీజేపీ, ఆరెస్సెస్స్ లు పెత్తనం చెలాయిస్తున్నాయని.. వాటిపై తాము పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత తాను షాక్ అయ్యాయని బాధిత ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాయని.. ఫలితంగా ఐదు లీటర్ల పాల బకెట్ పై పట్టు కోల్పోయాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఈ సమస్తిపూర్ నివాసి తన పిటిషన్ లో దేశద్రోహానికి సంబంధించిన 152 సహా పలు బీ.ఎన్.ఎస్. సెక్షన్ల కింద రాహుల్ గాంధీని విచారించాలని కోరారు. అయితే... గౌహతీలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.
కాగా... జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతీ సంస్థనూ బీజేపీ, ఆరెస్సెస్స్ లు స్వాధీనం చేసుకున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్స్ లతో పాటు భారత రాజ్యంతో పోరాటం చేస్తుందని అన్నారు.
ఇలా "భారత రాజ్యంతో పోరాటం" అనే వ్యాఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీజేపీ మండిపడింది. అయితే... దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్య చేశారంటూ కాంగ్రెస్ సమర్ధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై అస్సోం రాజధాని గౌహతీలో కేసు నమోదైంది.
ఆ వ్యాఖ్యల వల్లే తాను షాక్ కి గురై పాల క్యాన్ పై పట్టు కోల్పోయానని.. అందువల్ల తన పాలన్నీ నేలపాలు అయ్యాయని.. తనకు రూ.250 నష్టం వచ్చిందని తాజాగా ఫిర్యాదు చేశాడు బీహార్ వాసి.