తుపాకులతో కాల్చుకున్న 10వ తరగతి విద్యార్థులు... బీహార్ లో దారుణం!
అయితే.. అందుకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా తాజాగా బీహార్ లో పదోతరగతి విద్యార్థులు తుపాకులతో కాల్చుకున్న ఘటన తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 21 Feb 2025 11:22 AM GMTసాధారణంగా అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుందనే కథనాలు కనిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. అక్కడ రెగ్యులర్ గా ఏదో ఒక మూల తూపాకీ చప్పుళ్లు వినిపిస్తుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే.. అందుకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా తాజాగా బీహార్ లో పదోతరగతి విద్యార్థులు తుపాకులతో కాల్చుకున్న ఘటన తెరపైకి వచ్చింది.
అవును... పదో తరగతి పరీక్షల్లో మోసం చేశారనే ఆరోపణలు విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీశాయి. దీంతో.. రెచ్చిపోయిన విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా.. అందులో ఒక విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని రొహ్తాస్ జిల్లాలో సాసారామ్ పట్టణంలో నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల్లో చీటింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బుధవారం (ఫిబ్రవరి 19) విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మరుసటి రోజు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థుల మధ్య వ్యవహారం మరింత ముదిరి, భౌతిక దాడులకు దారి తీసింది.
అనంతరం తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు విద్యార్థులు. ఇందులో ఓ పదోతరగతి విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ విద్యార్థికి కాలిలో గాయం కాగా.. మరో విద్యార్థి వీపుకు గాయమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్ధరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.
స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉండటంతో.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
మరోపక్క.. హత్యకు గురైన బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా... న్యాయం జరిగే వరకూ స్థానిక రహదారిని దిగ్భందిస్తామని బైఠాయించారు. ఈ సమయంలో.. నిరసనకారులతో పోలీసు అధికారులు మాట్లాడి, శాంతించేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.