ఆ సీనియర్ సీఎం కులస్థులు అంత తక్కువా?
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిహార్ కుల గణన ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో చాలా ఆశ్చర్యకర ఫలితం ఏమంటే.
By: Tupaki Desk | 3 Oct 2023 2:30 PM GMTఆయన సాదాసీదా నాయకుడు కాదు.. దాదాపు 40 ఏళ్ల కిందటే జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. దగ్గరదగ్గరగా 30 ఏళ్ల కిందటే కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.. అన్నిటికిమించి సొంతంగా పార్టీని స్థాపించుకుని సీఎం స్థాయికి ఎదిగారు. మధ్యలో నరేంద్ర మోదీ వంటి నాయకుడినీ ఎదుర్కొన్నారు.
అలా ఎదగడమే కాదు.. సుమారు 18 ఏళ్లుగా ఒక రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు.
ఎంతో పరిణతి.. మరెంతో వ్యూహ చతురత.. ఏదో ఒక దశలో సామాజికవర్గ (కులం) అండదండలు ఉంటే తప్ప ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాధ్యం కాదు. కానీ, ఆ సీఎంకు సామాజిక వర్గ అండ పెద్దగా అవసరం కూడా పడినట్లు లేదు. ఎందుకంటే వారి రాష్ట్రలో ఆయన సామాజికవర్గానికి చెందినవారు కేవలం 2.87 శాతమేనని తేలడడం.
కులం కాదు నాయకత్వ లక్షణాలు ముఖ్యం..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిహార్ కుల గణన ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో చాలా ఆశ్చర్యకర ఫలితం ఏమంటే.. కూర్మీలు 2.87 శాతమేనని ఉండడం. వాస్తవానికి ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారే బిహార్ సీఎం నీతీశ్ కుమార్. ఆయన వాజ్ పేయీ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ, రైల్వే శాఖల మంత్రిగా పనిచేశారు. జనతా దళ్ నుంచి విడిపోయి జనతాదళ్ యునైటెడ్ పార్టీని స్థాపించారు. 2005 నుంచి మధ్యలో కొంతకాలం తప్ప ఆయనే సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. అంటే 15 ఏళ్లు పైగా బిహార్ సీఎం నీతీశ్ కుమారే. కానీ, ఆయన సామాజిక వర్గం 2.87 శాతమే. ఇక్కడ తేలిందేమంటే.. కులం కంటే నాయకత్వ, పరిపాలనా లక్షణాలు ముఖ్యమని.
కొసమెరుపు : బిహార్ కుల గణన ఓ విధంగా కేంద్రాన్ని ధిక్కరించి చేసినది. అందులో యాదవులు అత్యధికంగా 14.27 శాతం ఉన్నట్లు స్పష్టమైంది. ఓసీలు 15.52 శాతం ఉన్నట్లు తేలింది. దళితులు 19.65 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. నీతీశ్ సామాజికవర్గం కూర్మీలు చాలా తక్కువ సంఖ్య అనేంతగా 2.87 శాతం ఉన్నారు. అచ్చం ఇలానే తెలంగాణ సీఎం కేసీఆర్ సామాజికవర్గం అయిన వెలమలు కూడా తెలంగాణలో అత్యంత తక్కువ. వారివి మొత్తం 7 వేల కుటుంబాలే ఉంటాయని అంచనా. 50 వేలకు కాస్త పైగా జనాభా అన్నమాట. కానీ, నీతీశ్ లాగే కేసీఆర్ కూడా నాయకత్వ సామర్థ్యంతో సొంత పార్టీ పెట్టుకుని, ఉద్యమం నడిపి ఒక రాష్ట్రానికి సీఎం అయ్యారు.