Begin typing your search above and press return to search.

బిహారీ బాబు నితీష్ ఏం చేయబోతున్నారో ?

బీజేపీ చెప్పాల్సింది చెప్పేసింది. ప్రత్యేక హోదా అన్నది ఇవ్వలేమని స్పష్టంగా తేల్చేసింది

By:  Tupaki Desk   |   23 July 2024 3:15 AM GMT
బిహారీ బాబు నితీష్ ఏం చేయబోతున్నారో ?
X

బీజేపీ చెప్పాల్సింది చెప్పేసింది. ప్రత్యేక హోదా అన్నది ఇవ్వలేమని స్పష్టంగా తేల్చేసింది. 2012లోనే బీహార్ కి ఆ హోదా దక్కించుకునేందుకు అవకాశం లేదని చెప్పిన ఒక నివేదికను కూడా గుర్తు చేసింది. దాంతో ప్రత్యేక హోదావే తమకు కావాలని పట్టుబట్టి కూర్చున్న జేడీయూ ఇపుడు ఏమి చేయబోతోంది అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.

బీఎహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ మార్క్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే. ఆయన సడెన్ గా డెసిషన్స్ తీసుకుంటారు అని గత రెండు దశాబ్దాల రాజకీయం చూస్తే అర్ధం అవుతుంది. ఆయన ప్రస్తుతం బీహార్ సీఎం గా ఉన్న నాలుగేళ్ళ పదవీ కాలంలోనే మూడుసార్లు కూటములను మార్చారు.

ఇక జీవితకాలం అంతా ఎన్డీయేతో ఉంటాను అని ఆయన ఆ మధ్య పదే పదే చెప్పారు. అయితే ఇవన్నీ రాజకీయాలు దాంతో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి రాజకీయ ప్రయోజనలకు అనుగుణంగా వారు పావులు కదుపుతారు. నితీష్ చేతిలోకే తిరిగి బంతి చేరినట్లు అయింది.

నిజానికి బీహార్ కి ప్రత్యేక హోదా అన్నది పాత డిమాండే అయినా దానికి బూజు దులిపింది నితీష్ కుమార్ జేడీయూ. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి బీహార్ పీఠం అధిష్టించాలి అన్నది ఒక లెక్క అయితే కేంద్రంలో బీజేపీ వద్ద తన పలుకుబడిని టెస్ట్ చేసుకోవాలన్న ఆరాటం మరొకటి. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలలో ఇండియా కూటమి ఆ వైపున ఉంది.

నితీష్ కుమార్ కి అది కూడా ఆప్షన్ గా ఉన్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న నితీష్ బీహార్ కి సుదీర్ఘ కాలం సీఎం గా ఉన్నారు ఈ టెర్మ్ పూర్తి అయితే ఆయన ఏకంగా రెండు దశాబ్దాల పాటు నిరాటంకంగా సీఎం గా చేసిన రికార్డుని సొంతం చేసుకుంటారు.

దాంతో పాటు రాజకీయ జీవిత చరమాంకంలో ఆయన పదోన్నతిని కూడా కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఉప ప్రధానిగా అయినా తన రాజకీయాన్ని చూపించి పదవీ విరమణ చేయాలన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. ఇలా అనేక రకాలైన వ్యూహాలతోనే ఆయన ప్రత్యేక హోదాను ముందుకు తెచ్చారు

అయితే కేంద్రం అది కాదు అని తోసిపుచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయమూ కరెక్టే అని అంటున్నారు. బీహార్ కి హోదా ఇస్తే తేనే తుట్టెను కదిపినట్లే అని కూడా అంటున్నారు. హోదా కోసం ఏపీ ఒడిషా రెండూ సిద్ధంగా ఉన్నాయి. దాంతో పాటుగా మరిన్ని రాష్ట్రాలు క్యూ కట్టే పరిస్థితి ఉంది. దాంతో అర డజన్ దాకా స్టేట్స్ కొత్తగా స్పెషల్ స్టేటస్ కోరితే కేంద్ర బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అన్న చర్చ సైతం ఉంది.

దాంతో బీజేపీ ఆదిలోనే ఈ డిమాండ్లకు అడ్డుకట్ట వేసింది అని అంటున్నారు. మరి బీహార్ కి కేంద్రం ఏమి చేయబోతోంది అన్నది కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని మరో ఆల్టర్నేషన్ కూడా జేడీయూ చూపించింది. అది కూడా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల దాకా ప్యాకేజీ అని అంటోంది. అంత సొమ్ము కేంద్రం ఇస్తుందా లేక విడదల వారీగా సాయం చేస్తామని చెబుతుందా అన్నది చూడాలి.

బీహార్ కి ఎన్నికల వేళ హోదా కాదు ప్యాకేజీ అంటూ ఏదో ఒకటి చేయవచ్చు అని కూడా అంటున్నారు. కేంద్రం ఆలోచనలు ఇలా ఉంటే జేడీయూ దీంతో సంతృప్తి పడుతుందా లేక ఎర జెండా ఎగరేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఎర్ర జెండా ఎగరేస్తే అపుడు కేంద్రంలో ఎన్డీయే కూటమి పరిస్థితి ఏంటి అన్నది మరో చర్చగా ఉంది.

బీహార్ లో మొత్తం 17 మంది ఎన్డీయే మిత్రులు గెలిచారు. ఇందులో జేడీయూ వాటా 12 మంది ఎంపీలు ఆ మిగిలిన అయిదుగురిలో ముగ్గురు చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తికి అయిదుగురు ఎంపీలు, కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నాయకత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి ఒక ఎంపీ ఉన్నారు. బీజేపీకి 12 మంది ఎంపీలు ఉన్నారు.

ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని నితీష్ కుమార్ ఎన్డీయే కి గుడ్ బై చెబితే ఆయన వెంట ఎవరు నడుస్తారు అన్న చర్చ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రత్యేక హోదా ఎవరికీ ఇచ్చేది లేదని చెప్పి నితీష్ కుమార్ కి ఝలక్ ఇచ్చారు. ఆయన నితీష్ కుమార్ ని వ్యతిరేకిస్తారు. చిరాగ్ పాశ్వాన్ సైతం ఎదుగుతున్న యువ నాయకుడు.

ఏనాటికైనా సీఎం కావాలని ఆయనకు కోరిక ఉంది. నితీష్ కుమార్ తో పాటు ఆయన ప్రత్యేక హోదా గళం వినిపించినా ఎన్డీయేని వీడి ఆయన బయటకు వెళ్ళరని అంటున్నారు. అలా చూస్తే కనుక నితీష్ కుమార్ కి చెందిన 12 మంది ఎంపీలు ఎన్డీయేకు దూరం అయితే కేంద్రంలో ఎన్డీయే బలం 294 నుంచి 282కి పడిపోతుంది. అయినా మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది మంది ఎంపీల ఆధిక్యత ఎన్డీయేకు ఉంటుంది. దానికి తోడు వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు క్లిష్ట సమయంలో ఎలాగూ మద్దతు ఇస్తారు అన్న నమ్మకం సైతం ఉంది. ఇంకా చిన్నా చితకా పార్టీల మద్దతుని కూడా కూడగట్టవచ్చు.

ఏది ఏమైనా నితీష్ కుమార్ డిమాండ్ కి తలొగ్గకూడదు అనే బీజేపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు. బీహార్ లో బీజేపీ జేడీయూ కలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయి. విడిపోతే నష్టం వస్తుంది కానీ ప్రత్యేక హోదా వంటి వాటి విషయంలో మాత్రం కేంద్రం తన స్టాండ్ కి కట్టుబడాలని భావిస్తోంది అని అంటున్నారు. ఈ లెక్కలు అన్నీ తెలిసిన రాజకీయ ఉద్దండుడు నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెబుతారా అన్నదే ఒక పెద్ద ప్రశ్న.