Begin typing your search above and press return to search.

మోడీకి బీహార్ లో 17 మంది ఎంపీలు అడ్డం తిరిగారా ?

అసలే అరకొర మెజారిటీతో కేంద్రంలో నెల క్రితం మోడీ సర్కార్ మూడవసారి ఏర్పాటు అయింది.

By:  Tupaki Desk   |   1 July 2024 4:09 AM GMT
మోడీకి బీహార్ లో 17 మంది ఎంపీలు అడ్డం తిరిగారా ?
X

అసలే అరకొర మెజారిటీతో కేంద్రంలో నెల క్రితం మోడీ సర్కార్ మూడవసారి ఏర్పాటు అయింది. చిన్నా చితకా పార్టీలు అన్నీ కలసినా కూడా ఎన్డీయే మెజారిటీ 293 నంబర్ ని దాటడం లేదు. ఇక ఇందులో పెద్ద నంబర్లుగా టీడీపీ జేడీయూ ఉన్నారు. టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే జేడీయూకు 12 మంది ఉన్నారు.

దాంతో జేడీయూ ఒక విధంగా భయపెడుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అస్త్రాన్ని బయటకు తీశారు. హోదా ఇచ్చి తీరాల్సిందే అని జేడీయూ తీర్మానం చేసింది. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కాలేదు లోక్ జనశక్తి పార్టీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా అదే మాట అంటున్నారు.

బీహార్ కి ప్రత్యేక హోదా తమ డిమాండని చిరాగ్ పాశ్వాన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేమీ ఎన్డీయే మీద ఒత్తిడి చేసే రాజకీయం కాదు అని అంటూనే ఆయన డిమాండ్ గానే చెప్పారు.బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. దీనికి మేము అనుకూలమని ఆయన అన్నారు.

తామే కాదు ఏ పార్టీ అయినా బీహార్ కి ప్రత్యేక హోదా కావాలనే అంటుందని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అంటే ఇండియా కూటమిది అదే డిమాండ్ అని ఆయన అంటున్నారు. ఇక ఎన్డీయే ప్రభుత్వంలో చూస్తే జేడీయూకి 12 మంది ఉంటే లోక్ జనశక్తి పార్టీ ప్లస్ ఆర్వీ పార్టీకి కలపి 5 ఎంపీలు ఉన్నారు. టోటల్ గా చూస్తే ఈ నంబర్ 17కి చేరుకుంది.

మరి ప్రత్యేక హోదా డిమాండ్ తో నితీష్ చిరాగ్ ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. బీహార్ లో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో తిరిగి గెలవాలీ అంటే ఇదే పదునైన అస్త్రం అని భావిస్తున్నారు. ఈ డిమాండ్ ని మొదట చేసింది విపక్షంలో ఉన్న ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్. ఆయన సరిగ్గా గురి చూసి వదిలిన ఈ డిమాండ్ ఎన్డీయే కూటమికి బాగానే సెగ పెడుతోంది.

ఇపుడు ఈ డిమాండ్ తో ఎన్డీయే పార్టీలు ముందుకు పోవాల్సిందే లేకపోతే వారికి ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది. ఎన్డీయేలో ఉంటూ హోదా కూడా తేలేకపోయారు అని విపక్షం గట్టిగానే విరుచుకుపడుతుంది. ఎంపీ ఎన్నికల్లో గతసారి కంటే ఈసారి బలపడిన ఇండియా కూటమి సీఎం సీటు మీద గట్టిగానే టార్గెట్ చేసింది. దాంతోనే నితీష్ చిరాగ్ ఇద్దరూ ప్రత్యేక హోదా డిమాండ్ వినిపించాల్సి వచ్చింది అని అంటున్నారు

ఇక బంతి ఎన్డీయే కోర్టులోనే ఉంది. హోదా ఇవ్వాల్సిందే అన్నది అనివార్యం చేస్తూ బీహార్ పాలిటిక్స్ సాగుతోంది. కాదని కేంద్ర పెద్దలు చెబితే మాత్రం ఏకంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కే ముప్పు అని అంటున్నారు. అదెలా అంటే మొత్తం ఎన్డీయే బలం 293 మంది. ఇందులో నుంచి 17 మంది ఎంపీలను మైనస్ చేస్తే ఆ ఎన్డీయే బలం కాస్తా 276కి పడిపోతుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 272కి కి చాలా దగ్గరగా ఉండే నంబర్. కత్తి మీద సాములా ప్రభుత్వాన్ని నడపాలి అన్న మాట.

అదే సమయంలో 230 మంది మెంబర్స్ ఉన్న ఇండియా కూటమికి ఈ 17 మంది ప్లస్ అయితే హఠాత్తుగా వారి బలం 257కు చేరిపోతుంది. అంటే వారు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరకు వచ్చేస్తారు అన్న మాట. దాంతో ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అన్నది ఎన్డీయే పెద్దలే తేల్చుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం అది అంతిమంగా కేంద్ర ప్రభుత్వం కాళ్ల కిందకు నీళ్ళు తెచ్చేలాగానే నంబర్స్ భయపెడుతున్నాయని అంటున్నారు. అలాగని ప్రత్యేక ఇవ్వడం అంత సులువు కాదు. ఎందుకంటే బీహార్ కే ఇస్తే ఏపీకి కివ్వాలి. ఒడిషాకు ఇవ్వాలి. ఇంకా క్యూలో మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.

దీంతో ఎలా చూసుకున్నా బీజేపీ పెద్దలకు ముందు గొయ్యి వెనకాల నుయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలాగా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

.