లంచం సొమ్ము పంపకంలో తేడా.. నడిరోడ్డుపై చిత్తుగా కొట్టేసుకున్న పోలీసులు!
బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు ఓ కేసును సెటిల్ చేశారు.
By: Tupaki Desk | 19 Sep 2023 5:14 AM GMTలంచం ఇవ్వడం నేరం.. తీసుకోవడం అంతకన్నా నేరం.- ఈ మాట చెప్పుకొనేందుకు.. రాసుకునేందుకు చాలా బాగుంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో లంచం ఇవ్వకుండా.. ఈ దేశంలో పనులు జరగడం లేదని.. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థే వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలావుంటే, లంచం గా తీసుకున్న సొమ్ములో పంపకాలు తేడా వచ్చి.. నడిరోడ్డుపై చిత్తుగా కొట్టేసుకున్న పోలీసుల ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అందరూ దీనిని ఖండిస్తుండడంతోపాటు.. వారిని ఉద్యోగాల నుంచి కూడా తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగింది? బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు ఓ కేసును సెటిల్ చేశారు. ఈ క్రమంలో వారికి కొంత సొమ్ము లంచంగా ముట్టింది. వీరిద్దరూ కానిస్టేబుల్ స్థాయి వారే. అయితే.. ఈ సొమ్మును ఒక కానిస్టేబుల్ జేబులో పెట్టుకుని ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయి.. ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మంటెత్తిన రెండో కానిస్టేబుల్ తన వాటా ఇవ్వకపోవడంపై నిప్పులు చెరిగాడు. ఈ క్రమంలో నలందలోని ఓ రోడ్డుపై ఇద్దరు తారసపడ్డారు. లంచం విషయమై ఇరువురు గొడవకు దిగారు.
తోటి కానిస్టేబుల్(లంచం సొమ్ము మొత్తం జేబులో పెట్టుకున్న) పట్టించుకోకుండా వెళ్తుండటంతో ఆగ్రహించిన రెండో కానిస్టేబుల్ లాఠీతో చితక్కొట్టేశాడు. దీంతో ఇద్దరూ ఖాకీ చొక్కాలు పట్టుకొని మరీ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఫోన్లకు పనిచెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయినా.. కూడా ఇద్దరు పోలీసులు వెనక్కి తగ్గలేదు. సోషల్ మీడియాలో ఈ పోస్టు భారీ ఎత్తున వైరల్ అయింది.
ఈ ఘటనపై నలంద జిల్లా పోలీస్ శాఖ స్పందించింది. ఇద్దరు పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ నిర్ణయంపై స్పందించిన ఓ నెటిజన్ ‘ఇద్దరినీ సస్పెండ్ చేయడం కాకుండా.. శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని’ డిమాండ్ చేశాడు. ఇదే అభిప్రాయాన్ని మరికొందరు కూడా వ్యక్తం చేయడం గమనార్హం.