హిమాలయాల అంచున బైకర్ రిస్క్ జర్నీ.. చివరకు ప్రాణాల మీదకు..!
అయితే.. ఆ జర్నీలో మినిమం జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకూ ప్రమాదం లేకపోలేదు.
By: Tupaki Desk | 2 Sep 2024 1:30 PM GMTబైక్ రైడింగ్ అంటే చాలా మందికి మక్కువ. అందుకు.. ఎన్నో దూర ప్రయాణాలు చేస్తుంటారు. కొంత మంది హిమాలయాలకు వెళ్లాలనుకుంటే.. మరికొందరు విదేశాలకు ప్రయాణం అవుతుంటారు. బైక్ డ్రైవింగ్‌పై ఉన్న మక్కువతో వేలాది కిలోమీటర్ల జర్నీ చేస్తారు. అయితే.. ఆ జర్నీలో మినిమం జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకూ ప్రమాదం లేకపోలేదు.
కట్ చేస్తే.. అలాంటి దూర ప్రయాణానికి బయలుదేరిన ఓ రైడర్ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. లడఖ్ యాత్ర కోసం వెళ్లిన ఆ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అతని ప్రయాణం విషాదాంతమైంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముజఫర్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల చిన్మయ్ శర్మ నోయిడాలోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆగస్టు 22న లడఖ్ పర్యటనకు బయలుదేరాడు. ఐదు రోజులు ప్రయాణం చేశాక.. 27న తనకు తలనొప్పిగా ఉందని, ఆరోగ్యం బాగోలేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. విశ్రాంతి తీసుకోవాలని, వైద్య సహాయం తీసుకోవాలని అతని తండ్రి పరాగ్ సూచించారు.
కేంద్ర పాలిత ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాలలో వచ్చిన ఆక్సిజన్ లోపం కారణంగానే చిన్మయ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో వెంటనే అతను స్టే చేసిన హోటల్ యజమాని చిన్మయ్‌ని హాస్పిటల్‌లో చేర్పించారు. తల్లిదండ్రులు లేహ్ ప్రాంతానికి చేరుకునే లోపే చిన్మయ్ చనిపోయాడు. చిన్మయి తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు చిన్మయ్ ఏకైక సంతానం కావడంతో విషాదంలో మునిగిపోయారు.