ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నది సాధించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన సేవలకు ఒప్పందం కుదుర్చకున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 4:17 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నది సాధించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన సేవలకు ఒప్పందం కుదుర్చకున్నారు. ఆయా రంగాల్లో ఏఐ టెక్నాలజీతోపాటు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించనున్నారు. దీనివల్ల ప్రజలకు శక్తివంతమైన సేవలు సత్వరమే అందే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలు అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకరించనుంది. ఈ రోజు ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయింది. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించింది.
ఈ ఏడాది జనవరిలో దావోస్ లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనే బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సాంకేతిక సాయం అందజేయాల్సిందిగా కోరారు. అయితే తన బృందంతో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అప్పట్లో బిల్స్ గేట్స్ తెలిపారు. అంతేకాకుండా చెప్పినట్లే కేవలం రెండు నెలల్లోనే తన మాట నిలబెట్టుకున్నారు.
బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తన విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ - 2047 సాకారం చేసుకోవడానికి గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ అకౌంట్లో ఆనందం వ్యక్తం చేశారు.