Begin typing your search above and press return to search.

భూగర్భంలో అద్భుతాలు.. ఈ శ్రీమంతుల నిర్మాణాలు!

ఇక అత్యంత ధనవంతుల ఇళ్ల గురించి చెప్పాలంటే అవి ప్యాలెస్ లే. కాగా, ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో చాలామంది శ్రీమంతులు జరగరానిది జరిగితే ప్రాణాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 2:30 PM GMT
భూగర్భంలో అద్భుతాలు.. ఈ శ్రీమంతుల నిర్మాణాలు!
X

కాస్త డబ్బున్నవారు ఈ రోజుల్లో ఫాం హౌస్ కట్టుకుంటున్నారు. ఇంకాస్త డబ్బున్నవారు తమదైన స్థాయిలో భారీ భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇక అత్యంత ధనవంతుల ఇళ్ల గురించి చెప్పాలంటే అవి ప్యాలెస్ లే. కాగా, ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో చాలామంది శ్రీమంతులు జరగరానిది జరిగితే ప్రాణాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి వారు చేసుకునే ఏర్పాట్లు ఏమిటో తెలుసా?

అణుదాడులు జరిగినా.. చెక్కుచెదరకుండా

30 ఏళ్ల కిందటే ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్.. తన సంపదలో చాలా దానం చేశారు. అయితే, ఇప్పటికీ వేల కోట్ల సంపద ఆయన సొంతం. గేట్స్ ఇళ్లు అన్నిట్లోనూ భూగృహాలు ఉంటాయట. వాషింగ్టన్‌ మెడీనా ప్రాంతంలోని 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని విలాస భవంతిలో ఉంటున్న గేట్స్.. మరో 6 పైగా ఇలాంటి భవంతులు ఉన్నాయట. వీటి అన్నింటిలోనూ అత్యంత విలాస, సురక్షిత భూగృహాలు నిర్మించినట్లు చెబుతారు. అణు దాడులు, కొవిడ్ వంటి మహమ్మారులు, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు కూడా ఏమీ చేయలేవట.

మస్క.. సైబర్‌ హౌస్‌

టెస్లా, స్పేస్ ఎక్స్ అనే కాదు.. ఇతర గ్రహాలపై ఆవాసమే లక్ష్యంగా కొత్త కొత్త ఆవిష్కరణలకు పేరుగాంచిన ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. మస్క్‌ నివాసం ఉండేందుకు ‘సైబర్‌ హౌస్‌’ కట్టుకుంటున్నారట. దీన్ని ఎప్పుడు ఎక్కడ నిర్మించనున్నారనే అంశంపై స్పష్టత లేదు. మస్క్‌ హైటెక్ ఆలోచనలకు తగ్గట్లు రష్యన్‌ డిజైనర్‌ లెక్స్‌ విజెవ్‌స్కీ దీనిని రూపొందించారట. అణు దాడులకు చెక్కు చెదరకుండా ఉండడమే కాదు.. వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి కూడా రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారట. సోలార్‌ ప్యానెల్స్, విండ్‌ టర్బైన్స్‌ తో పాటు, మంచినీటి కోసం ప్యూరిఫికేషన్‌ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలను ప్రయోగించినా.. చెక్కుచెదరని ఎయిర్‌లాక్‌ డోర్స్, మెటల్‌ రోల్‌ షట్టర్స్‌ తో సైబర్‌ హౌస్‌ను నిర్మించనున్నారు. దీని డిజైన్‌ మూడేళ్ల కిందటే పూర్తయినా నిర్మాణం కార్యరూపం దాల్చాల్సి ఉందట.

1,400 ఎకరాల్లో ఫేస్ బుక్ అధినేత..

‘ఫేస్‌ బుక్‌’ అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అమెరికాకు చెందిన హవాయి దీవుల్లోని కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని రూ.843 కోట్లకు కొని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షిత భూగర్భ స్థావరాన్ని నిర్మిస్తున్నారట. దీన్ని రహస్యంగా చేపట్టినా, నిర్మాణం ఫొటోలు మీడియాకు చిక్కాయట. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరేందుకు సొరంగం కూడా ఉందట. ఏం జరిగినా ఆహార పదార్థాల సరఫరాకు అడ్డంకి లేకుండా ఏర్పాట్లు, నిరంతర మంచినీటి సరఫరాకు ప్యూరిఫికేషన్‌ సిస్టమ్, కీ బోర్డు ద్వారా పనిచేసే సౌండ్‌ ప్రూఫ్‌ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్‌ ఎలివేటర్లు, మెకానికల్‌ రూం, స్విమింగ్‌ పూల్, జిమ్, సినిమా థియేటర్‌ తో అన్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఈ భూగృహ నిర్మాణానికి రూ.2,278 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.

బెజోస్‌ ఇళ్లలో భూగృహాలు

ఇంటింటికీ అన్ని రకాల వస్తువులును అందించే అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఈయనకు ఫ్లోరిడా లోని ఇండియన్‌ క్రీక్‌ దీవిలో మూడు భారీ భవంతులు ఉన్నాయి. అన్నిట్లోనూ సురక్షిత భూగర్భ స్థావరాలు కామన్. రూ.1,999 కోట్లు ఖర్చు పెట్టి మరీ వీటిని నిర్మించారట. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్‌ఫార్మర్‌కో వ్యవస్థాపకుడు, సియర్స్‌ మాజీ సీఈవో అమెరికన్‌ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు టామ్‌ బ్రాడీ, గూగుల్‌ మాజీ సీఈవో ఎరిక్‌ ష్మీడ్, ఏకాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు కార్ల్‌ ఏకాన్‌ తదితరులు సైతం భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.