Begin typing your search above and press return to search.

బిల్లులు లేట్.. పంచాయితీ ట్రాక్టర్ తీసుకెళ్లిపోయిందట!

ప్రభుత్వ పనులు చేయటం.. వాటి బిల్లుల కోసం నానా తిప్పలు పడటం ఇటీవల కాలంలో మామూలైపోయింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 8:30 AM GMT
బిల్లులు లేట్.. పంచాయితీ ట్రాక్టర్ తీసుకెళ్లిపోయిందట!
X

ప్రభుత్వ పనులు చేయటం.. వాటి బిల్లుల కోసం నానా తిప్పలు పడటం ఇటీవల కాలంలో మామూలైపోయింది. పనులు చేసి బిల్లులు రాక కిందా మీదా పడే వారంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండటం చూశాం. కానీ.. తాజా ఉదంతంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. ఇందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేదికైంది. గ్రామ సర్పంచ్ గా పని చేసి.. తాను అధికారంలోఉన్నప్పుడు చేయించిన పనుల బిల్లులు రాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక మాజీ మహిళా సర్పంచ్ చేసిన పని గురించి తెలిసి అవాక్కు అవుతున్నారు.

బిల్లులు చెల్లింపులు లేట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం చిన్నతూండ్ల మాజీ సర్పంచి పులిగంటి మమత పంచాయితీకి చెందిన ట్రాక్టర్ ను సోమవారం తన ఇంటికి తీసుకెళ్లారు. బకాయిలు పడిన వేళ.. వాటిని సకాలంలో తీర్చకుంటే సదరు వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేయటమో.. స్వాధీనం చేసుకోవటమో చూస్తాం. అదే రీతిలో మాజీ సర్పంచి తీరు ఉండటం సంచలనంగా మారింది.

గ్రామంలో తాగునీరు.. మురుగు కాలువ నిర్మాణం.. విద్యుత్తు దీపాలతో పాటు ఇతరత్రా పనులకు సంబంధించి రూ.2.31 లక్షల విలువ చేసే పనులు చేపట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. గత నెల 26 లోపు బిల్లులు చెల్లించాలని పంచాయితీ అధికారిని కోరారు. అయితే.. మామూళ్లు ఇస్తేనే చెక్కు ఇస్తానని సదరు అధికారి మెలిక పెట్టారని మండిపడుతున్న ఆమె.. మిగిలిన వారికి భిన్నంగా పంచాయితీ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని తన ఇంటికి తీసుకెళ్లారు.

తాను ఖర్చు చేసిన డబ్బులు ఇచ్చే వరకు ట్రాక్టర్ ను తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న ఆమె తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారులు మాత్రం తాము లంచం అడగలేదని.. ఆమెకు చెల్లించాల్సిన బకాయిల్ని నిబంధనల ప్రకారం చెల్లిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా పంచాయితీ ట్రాక్టర్ ను ఇలా తీసుకెళ్లిపోవటం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఎపిసోడ్ లో ఉన్నతాధికారులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.