Begin typing your search above and press return to search.

'సుల‌భ్‌' సృష్టి క‌ర్త ఇక లేరు!

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ 80 ఏళ్ల బిందేశ్వర్ పాఠక్‌ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 7:27 PM GMT
సుల‌భ్‌ సృష్టి క‌ర్త ఇక లేరు!
X

'సుల‌భ్' దేశంలో ఈ మాట విన‌ని వారు.. వినియోగించుకోనివారు చాలా త‌క్కువ మంది ఉంటారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాల‌కు మంచి నేస్తంగా మారి.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశుభ్ర‌త‌కు, మానవ వ్య‌ర్థాల నుంచి ఇంధ‌నం త‌యారీకి రూప‌ క‌ల్ప‌న చేసిన బిందేశ్వ‌ర్ పాఠక్‌.. ఇక‌లేరు. స్వాతంత్య్ర దినోత్స వాన్ని పుర‌స్క‌రించుకుని.. జెండా ఆవిర్ష‌ణ అనంత‌రం.. అక‌స్మాత్తుగా కుప్ప‌కూలి మృతి చెందారు. ఐదు ద‌శాబ్దాల కింద‌ట ప‌ర్యావ‌ర‌ణానికి అత్యంత హానిక‌రంగా ప‌రిణ‌మించిన మాన‌వ వ్య‌ర్థాల‌పై పోరు బాట ప‌ట్టిన పాఠ‌క్ గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ 80 ఏళ్ల బిందేశ్వర్ పాఠక్‌ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం బిందేశ్వర్ పాఠక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ.. ఆయ‌న క‌న్నుమూశారు.

మాన‌వ వ్య‌ర్థాల‌ను మ‌నుషులు శుభ్రం చేయ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక పోయారు. అంతేకాదు.. బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఫ‌లితంగా అంటు వ్యాధుల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే 5 దశాబ్దాల క్రితం సుల‌భ ఇంట‌ర్నేష‌న‌ల్ పేరుతో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో సుల‌భ్ కాంప్లెక్సుల‌ను నిర్మించారు. ఇక‌, గ్రామీణ స్థాయిలోనూ దీనిని తీసుకువెళ్లారు.

ఆ త‌ర్వాత‌.. 30 ఏళ్ల కింద‌ట‌ సులభ్ టాయిలెట్లను ఫెర్మెంటేషన్ ప్లాంట్లకు అనుసంధానం చేయడం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి ప్రారంభించారు. అదేవిధంగా స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

మురికివాడలు, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలలో 7,500 కంటే ఎక్కువ పబ్లిక్ టాయిలెట్ల ను నిర్మించి, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా పే-అండ్ యూజ్ ప్రాతిపదికన వాటిని నిర్వహిస్తున్న తొలి వ్యక్తి డాక్టర్ పాఠక్. ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. 1991లో భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ లభించింది.