Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌కు `కోడి జ్వ‌రం`!

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ.. కోడి జ్వ‌రం ప‌ట్టుకుంది. బ‌ర్డ్ ఫ్లూ వ్యాప్తి కార‌ణంగా.. ల‌క్ష‌కు పైగా కోళ్లు రెండు రాష్ట్రాల్లోనూ మృతి చెందాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 11:32 AM GMT
తెలుగు రాష్ట్రాల‌కు `కోడి జ్వ‌రం`!
X

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ.. కోడి జ్వ‌రం ప‌ట్టుకుంది. బ‌ర్డ్ ఫ్లూ వ్యాప్తి కార‌ణంగా.. ల‌క్ష‌కు పైగా కోళ్లు రెండు రాష్ట్రాల్లోనూ మృతి చెందాయి. దీంతో తెలంగాణ స‌హా ఏపీలోనూ ఆంక్ష‌లు విధించారు. తెలంగాణ‌లో కోళ్ల ర‌వాణాను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లాల స‌రిహ‌ద్దుల్లోనూ పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ర‌వాణాను నియంత్రిస్తున్నారు. అదేస‌మ‌యంలో మ‌ర‌ణించిన కోళ్ల‌ను కూడా.. ఎవ‌రూ ముట్టుకోకుండా లోతైన గుంత‌లు తీసి.. సామూహిక ఖ‌న‌నం చేస్తున్నారు.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేలాది కోళ్లు బ‌ర్డ్ ఫ్లూతో మృతి చెందడంపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పరిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని.. దానిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పశు వైద్యులు అందుబాటులో ఉండాలని... చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్‍కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజ‌ర్స్‌ అమలు చేయాలని మంత్రి అచ్చెన్న సూచించారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా 70 వేల‌కు పైగానే కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా మంత్రి తెలిపారు.

కోట్ల వ్యాపారానికి గండి!

తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కోళ్ల‌మీదే రోజూ కోట్ల రూపాయ‌ల వ్య‌పారం జ‌రుగుతుంది. ప్ర‌ముఖ రెస్టారెంట్ల నుంచి.. వీధి చివ‌రి మాంసం కొట్టు వ‌ర‌కు.. అంద‌రి బిజినెస్ చికెన్‌పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇత‌ర మాంసాలు ఉన్న‌ప్ప‌టికీ.. చికెన్ ఉన్న డిమాండే వేరు. దీంతో రోజుకు ఎంత లేద‌న్నా.. 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. కోళ్ల వినియోగం, ర‌వాణాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు విధించ‌డంతోపాటు మాంసం దుకాణాల‌ను కూడా నిలుపుద‌ల చేయించారు.