Begin typing your search above and press return to search.

ఫ్యాక్ట్ చెక్.. ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందా?

అయితే అది అసత్యమని తాజాగా తేలింది.. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి క్లారిటీ వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Feb 2025 3:43 PM GMT
ఫ్యాక్ట్  చెక్.. ఏపీలో మనిషికి బర్డ్  ఫ్లూ సోకిందా?
X

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ సమయంలో.. ఏపీలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు వార్తలొచ్చాయి. అయితే అది అసత్యమని తాజాగా తేలింది.. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి క్లారిటీ వచ్చింది.

అవును... ఇప్పటివరకూ కోళ్లలో మాత్రమే గుర్తించబడిన బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతోందంటూ వచ్చినవార్తల్లో వాస్తవం లేదని.. జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ విషయంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.

ఇందులో భాగంగా... బర్డ్ ఫ్లూ పై కొన్ని పత్రికలు, సోషల్ మీడియా ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని చెప్పిన అచ్చెన్నాయుడు.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. బర్డ్ ఫ్లూపై శాస్త్రవేత్తలు, కేంద్రంతో చంద్రబాబు చర్చించారని.. వారు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని.. బర్డ్ ఫ్లూ గురించి ఎవరేమి చెప్పినా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. వ్యాధి సోకిన కోళ్లకు సంబంధించి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

కాగా... ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా రోజుల వ్యవధిలోనే లక్షల కోళ్లు చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన కోళ్లను దూరంగా పాతిపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయలో పౌల్టీ పరిశ్రమల వద్దకు చేరుకుంటున్న ప్రత్యేక బృందాలు పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్తీషియా ఇస్తున్నారు.

మరోపక్క తెలంగాణలోనూ పశు సంవర్థక శాఖ అలర్ట్ అయ్యింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని.. వాటిని తరలించే విషయంలోనూ కీలక జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభసాచి గోష్.. ఆదేశాలు జారీ చేశారు.