Begin typing your search above and press return to search.

మనుషులను టార్గెట్ చేసిన బర్డ్ ఫ్లూ... సీడీసీ ఏమి చెబుతుందంటే...?

వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   31 May 2024 3:30 PM GMT
మనుషులను టార్గెట్  చేసిన బర్డ్  ఫ్లూ... సీడీసీ ఏమి చెబుతుందంటే...?
X

ఇన్నాళ్లూ పక్షులు, జంతువులకు పరిమితమైన బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు మనుషులనూ టార్గెట్ చేస్తున్నట్లుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురికి సోకింది. ఈ మేరకు పాడి పశువులలో ప్రస్తుత వైరస్ వ్యాప్తికి సంబంధించిన బర్డ్ ఫ్లూ తాజాగా మూడవ మనిషికి సోకిందని అమెరికా అధికారులు నివేదించారు. దీంతో... మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ విషయం వైరల్ గా మారింది.

అవును... అమెరికాలో మనుషులకూ బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంది. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైంది. మిచిగాన్ వ్యవసాయ కార్మికుడు ఏప్రిల్‌ లో టెక్సాస్‌ లో మొదటి కేసు కాగా.. మిడ్‌ వెస్ట్రన్ రాష్ట్రంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రెండో కేసు. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైందని, అతనికి ఆవుల నుంచి ఈ వైరస్ సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో ఈ మూడు కేసులూ ఆవుల నుండి మనుషులకు వ్యాపించాయని.. ఇవి మనిషి మనిషికీ భిన్నంగా ఉన్నాయని.. ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. ఈ వ్యాది సోకినవారు దగ్గు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది.

ప్రస్తుతం వీరిని ఇంట్లోనే ఉంచి యాంటీవైరల్ మెడిసిన్ ఒసెల్టామివిర్ తో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. సదరు కార్మికుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించలేదని, పాడి పశువులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యక్తిగత రక్షణ ముఖ్యమని ఈ మేరకు ఆరోగ్య అధికారులు సిఫార్సు చేశారని మిచిగాన్ ఆరోగ్య విభాగం తెలిపింది.

వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది. దీంతో... బర్డ్ ఫ్లూకి ఇది ప్రమాద కారకంగా ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. మరికొంతమంది యూఎస్ అధికారులు మాత్రం... బర్డ్ ఫ్లూ ఆవులకు సోకడానికి అడవి పక్షులే కారణమని విశ్వసిస్తున్నారు.

కాగా... బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన ఆవుల పచ్చి పాలను అలాగే తాగితే, మనుషులకు కూడా ఆ వైరస్‌ సోకే ప్రమాదముందని అట్లాంటాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకులు తెలిపారు. వైరస్‌ సోకిన జంతువుల పాలను నేరుగా తీసుకోవడం మానుకోవాలని, పాశ్చరైజేషన్‌ చేశాకే వాటిని వినియోగించాలని సూచించారు.