బీజేపీ ‘అత్యంత వివాదాస్పద’ ముఖ్యమంత్రి అనూహ్య రాజీనామా
రెండు జాతులు.. కుకీ, మైతేయి వర్గాల ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తీవ్రంగా ప్రభావితం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Feb 2025 1:57 PM GMTదాదాపు 28 ఏళ్ల తర్వాత ఢిల్లీ సీఎం పీఠం దక్కిందని సంతోషిస్తున్న బీజేపీకి 24 గంటల్లోనే షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అనూహ్యంగా రాజీనామా చేశారు. దాదాపు 20 నెలలుగా రగులుతున్న రాష్ట్రంలో ఆయన రాజీనామాకు గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ, బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా పదవి నుంచి వైదొలగారు.
రెండు జాతులు.. కుకీ, మైతేయి వర్గాల ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తీవ్రంగా ప్రభావితం అవుతున్న సంగతి తెలిసిందే. 2023 మే 5న ఘర్షణలు మొదలయ్యాయి. ఇళ్ల దహనాలు, అత్యాచారాలు, ఆందోళనలు, కిడ్నాప్ లు, హత్యాచారాలు సర్వసాధారణంగా మారాయి. మణిపుర్ ఉదంతం పార్లమెంటును కుదిపేసింది. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి. ప్రధాని మోదీ మణిపుర్ ను సందర్శించాలంటూ పట్టుబట్టాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శాంతి చర్చలు సాగించారు. అయినా మణిపుర్ ఇంకా చల్లారలేదు. తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
కాగా, జాతుల ఘర్షణకు మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ కారణం అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ‘మైతేయీలను తుపాకులు దోచుకోనివ్వండి’ అంటూ బీరేన్ సింగ్ మాట్లాడిన మాటల తాలూకు ఆడియో బయటకు వచ్చింది. అంతేకాక ఈ ఆడియోను హైదరాబాద్ కు చెందిన ట్రూత్ ల్యాబ్ లో నిర్ధారణకు పంపగా ఆడియో 97 మ్యాచ్ అయింది. గత ఏడాది అల్లర్ల సందర్భం నాటి ఈ ఆడియో సరిగ్గా వారం కిందట వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో అనేక విమర్శలు ఎదుర్కొన్న బీరెన్ సింగ్.. 19 నెలల తర్వాత పదవినుంచి వైదొలగడం గమనార్హం. మణిపుర్ అల్లర్లలో 200 మంది చనిపోయినట్లగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను కిడ్నాప్ చేసి హత్యాచారాలు చేసినట్లుగా ఇంకా అనేక ఆగడాలు జరిగినట్లు కథనాలు వచ్చాయి.