హైదరాబాద్ అమెజాన్ గోదాంలో అలాంటి ఐటెమ్స్?
ప్రతి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యతకు ప్రమాణమైన ఐఎస్ఐ మార్కుతో పాటు.. ఇతర గుర్తింపులు అవసరం.
By: Tupaki Desk | 27 March 2025 4:51 AMహైదరాబాద్ లోని అమెజాన్ గోదాంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్మయానికి గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. పెద్ద ఎత్తున బీఐఎస్ ధ్రువీకరణ పొందని పలు గ్రహూపకరణాలు.. సాంకేతిక ఉపకరణాలను గుర్తించారు. వందలాదిగా ఉన్న వీటిని గుర్తించి సీజ్ చేశారు. ప్రతి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యతకు ప్రమాణమైన ఐఎస్ఐ మార్కుతో పాటు.. ఇతర గుర్తింపులు అవసరం.
కానీ.. ఇవేమీ లేకుండా నాసిరకపు ఉత్పత్తులను కొందరు ఉత్పత్తి చేస్తుంటారు. ఈ తరహాకు చెందిన వస్తువుల్ని తాజా తనిఖీల్లో గుర్తించారు.హైదరాబాద్ పరిధిలోని ఎయిర్ పోర్టు సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో నిర్వహించిన తనిఖీల్లో దాదాపు రూ.50 లక్షలు విలువైన 2783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించారు.
సీజ్ చేసిన వస్తువులకు 150 స్మార్ట్ వాచ్ లు.. 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు.. 30 సీసీ టీవీ కెమెరాలు.. 16 మిక్సర్లు.. 10 ప్రెజర్ కుక్కర్లు.. 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు.. 326 వైర్ లెస్ ఇయర్ బడ్స్.. 170 మొబైల్ ఛార్జర్లు.. 90 ఆట బొమ్మలు.. ఇతర గ్రహూపకరణాలను జఫ్తు చేసి కేసు నమోదు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. బీఐఎస్ చట్టం 2016 లోని సెక్షన్ల 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులు ఏవీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవటాన్ని గుర్తించారు.
బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని వస్తువుల్ని ఉత్పత్తి చేసినా.. నిల్వ చేసినా.. అమ్మినా రెండేళ్లు జైలుశిక్ష.. రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. ఇది మొదటిసారి తప్పు చేసినప్పుడు. అదే రెండోసారి అదే తీరును రిపీట్ చేస్తే ఐదేళ్లు జైలు.. రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తర్వాత మళ్లీ ఇదే నేరం చేస్తే దీనికి పదిరెట్లు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన అంశం ఏమంటే.. ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా సరే.. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అన్నది ముఖ్యం.