టీ సచివాలయంలో షాకింగ్ సీన్.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం!?
తెలంగాణ సచివాలయంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఉదంతం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 23 Nov 2024 5:22 AM GMTతెలంగాణ సచివాలయంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఉదంతం సంచలనంగా మారింది. వీఐపీలు ఎక్కువగా ఉండే అక్కడ విధులు నిర్వర్తించే భద్రతా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే అన్నది కూడా చూడకుండీ తోసేసిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి చాంబర కు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెళుతున్నారు.
సచివాలయంలోని ఆరో అంతస్తులోకి వెళుతున్న సందర్భంలోనే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఒక రివ్యూకు హాజరై వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలపై సమీక్షను నిర్వహించారు. ఈ రివ్యూకు హాజరైన ఆమె.. తిరిగి తన చాంబర్ వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ నడిచే మార్గానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అక్కడ ఉన్న వారిని పక్కకు తోసేశారు.
వేం నరేంద్రరెడ్డిని కలిసేందుకు వెళుతున్న వనపర్తి ఎమ్మెల్యేను లాగేయటంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తాను ఎమ్మెల్యేనని.. తానెవరో తెలుసుకోకుండా ఇలా తోసేయటమా? అని మండిపడ్డారు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది స్పందించకపోగా.. నిర్లక్ష్యంతో బదులిచ్చిన వైనంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అన్న విషయం తమకు తెలీదన్న భద్రతా సిబ్బంది వ్యాఖ్యలు చూస్తే.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దగ్గరకు వచ్చేస్తున్న వేళ.. ఎమ్మెల్యేల గురించి అవగాహన లేకుండా పోవటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి సీఎం ఉండే ఆరో అంతస్తుకు వచ్చే వారంతా దాదాపుగా ప్రముఖులు.. ముఖ్యులు.. ప్రజాప్రతినిధులే ఉంటారు. అలాంటప్పుడు హైసెక్యూరిటీ జోన్ లో ఉండే ఒక ఎమ్మెల్యే పట్ల అలా దురుసుగా వ్యవహరించం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. తాజా ఉదంతంలో మేఘా రెడ్డికి జరిగినట్లే.. ఇటీవల కాలంలో పలువురి విషయంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.