Begin typing your search above and press return to search.

పదేళ్ల పాలన : గెలుపే టార్గెట్.. ఢిల్లీపై బీజేపీ, ఆప్ ఆపసోపాలు!

ఢిల్లీ గద్దెపై కూర్చొని దేశాన్ని ఏలుతోంది ఒక పార్టీ.. ఢిల్లీని ఏలుతోంది మరోపార్టీ.. ఈ రెండు పార్టీల మధ్య అసెంబ్లీ సమరం పతాకస్థాయికి చేరింది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 8:30 PM GMT
పదేళ్ల పాలన : గెలుపే టార్గెట్.. ఢిల్లీపై బీజేపీ, ఆప్ ఆపసోపాలు!
X

ఢిల్లీ గద్దెపై కూర్చొని దేశాన్ని ఏలుతోంది ఒక పార్టీ.. ఢిల్లీని ఏలుతోంది మరోపార్టీ.. ఈ రెండు పార్టీల మధ్య అసెంబ్లీ సమరం పతాకస్థాయికి చేరింది. రేపు జరగనున్న పోలింగులో ఓటర్లు రెండు పార్టీల భవిష్యత్ ను నిర్దేశించనున్నారు. నెల రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. హొరాహోరీగా ప్రచారం సాగినా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సెగ రెండేళ్ల క్రితం నుంచే మొదలైంది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలతోపాటే నవంబర్ లోనే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరినా, ఎన్నికల కమిషన్ మాత్రం యథావిధిగా గడువు ప్రకారమే ఎన్నికలు నిర్వహణకు సిద్ధమైంది.

బుధవారం జరిగే ఎన్నికలు ప్రస్తుత అధికారపార్టీ ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సవాల్ గా మారాయి. 2013 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో కొనసాగుతోంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆప్.. ప్రతిపక్షమే లేకుండా అధికారం చలాయించింది. ఇదే సమయంలో 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. దేశవ్యాప్తంగా తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినట్లు పనిచేసినా, ఢిల్లీలో ఆ పార్టీ పావులు పారలేదు. ఇలా పదేళ్లుగా రెండు పార్టీలు అధికారం కోసం కొట్లాడుతూనే ఉన్నాయి. తాజాగా మూడోసారి ఎన్నికల కురక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని అంటున్నారు. 2013లో కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకున్న ఆప్.. ఆ తర్వాత కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసింది. 2103 తర్వాత మూడుసార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇదేసమయంలో బీజేపీ ఢిల్లీలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాలనూ కైవసం చేసుకుంది. ఇలా అసెంబ్లీకి ఆప్, పార్లమెంట్ కు బీజేపీని గెలిపిస్తూ వస్తున్న ఢిల్లీ ఓటర్లు ఈ సారి ఎవరికి జైకొడతారనేది ఆసక్తి రేపుతోంది.

పాతికేళ్లుగా ఢిల్లీలో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ.. ఈ సారి తీవ్రంగా ప్రయత్నించింది. ప్రధాని మోదీ దగ్గర నుంచి బీజేపీలో టాప్ లీడర్లు అంతా ఢిల్లీ గల్లీల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షమైన టీడీపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు వరకు ముఖ్య నేతలు అందరూ ప్రచారం చేశారు. అటు ఆప్ మాత్రం కేజ్రీవాల్ పైనే పూర్తిగా ఆధారపడింది. ప్రస్తుతం 67 సీట్లతో అధికారంలో కొనసాగుతున్న ఆప్ ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామంటోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు మంత్రులు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటివారిని జైలుకు పంపడంపై సానుభూతి తెచ్చుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీజేపీతో పోటాపోటీగా ఉచిత హామీలు గుప్పించింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.